Pakistan: పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ.. ప్రభుత్వం ఏర్పాటుపై కుదిరిన ఒప్పందం
సుదీర్ఘ చర్చల అనంతరం పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)ల మధ్య ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ, ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపడతారని పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ మంగళవారం అర్థరాత్రి ప్రకటించినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి..

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 21: సుదీర్ఘ చర్చల అనంతరం పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)ల మధ్య ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ, ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపడతారని పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ మంగళవారం అర్థరాత్రి ప్రకటించినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పీపీపీ, పీఎంఎల్‌ఎన్ నేతలు సంయుక్త వార్తా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
భుట్టో-జర్దారీ మాట్లాడుతూ.. పీపీపీ, పీఎంఎల్‌ఎన్ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ సాధించాయి. ప్రస్తుతం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నాం. పాక్ ప్రధానిగా మరోసారి షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపడతారని స్థానిక జియో న్యూస్‌కు వెల్లడించారు. దీంతో పదవుల పంపిణీ విషయమై కొద్ది రోజుల నుంచి జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లయ్యింది.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ తరపున బరిలోకి దిగిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) ఎన్నికలలో సాధారణ మెజారిటీని సాధించడంలో విఫలమైంది. దీంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు సంకీర్ణ ఒప్పందం జరిగింది. చర్చలు సానుకూల ముగింపుకు వచ్చినందుకు ఇరు పార్టీల నాయకత్వానికి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు పార్టీల మధ్య ఐక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కరువైంది. దీంతో ఇన్నాళ్లు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. అధికార-భాగస్వామ్య ఏర్పాట్లపై ఏకాభిప్రాయానికి రావడానికి ఇరుపక్షాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. కాగా పాక్‌లో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌ఎన్ పార్టీ 75 స్థానాలతో తొలి స్థానంలో, పీపీపీ 54 స్థానాలతో మూడవ స్థానంలో నిలిచాయి. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (MQM-P) పార్టీ 17 స్థానాలతో ఈ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మూడు పార్టీల సంకీర్ణంతో సమిష్టిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.


