Narendra Modi: పాకిస్తాన్ ప్రధానితో నరేంద్రమోదీ సమావేశం..? ఇక్కడేనా..
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 2015 డిసెంబర్ 25వ తేదీన ఆప్ఘనిస్తాన్ లో ఒక రోజు పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు..
SCO Summit: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 2015 డిసెంబర్ 25వ తేదీన ఆప్ఘనిస్తాన్ లో ఒక రోజు పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో లాహోర్ లో దిగి.. అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశమై అందరినీ ఆశ్చర్యపర్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మరోసారి పాకిస్తాన్ ప్రధానితో సమావేశమవుతారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. రేపు, ఎల్లుండి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ తో పాటు మొత్తం 15 మంది దేశాధినేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కోవిడ్ మహమ్మారి తరువాత జరుగుతున్న మొదటి సమావేశం కాగా.. చివరి షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం 2019 జూన్ నెలలో కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్‌కెక్‌లో జరిగింది. సెప్టెంబర్ 14వ తేదీ బుధవారం ఆయన ఉజ్బెకిస్తాన్ వెళ్లి 16 తేదీన తిరిగి భారత్ కు రానున్నారు. వచ్చే ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుంది. దీంతో ఈ సమావేశం భారతదేశానికి కీలకం కానుంది. 2023 ఏడాదికి గానూ SCOకు భారత్ నాయకత్వం వహించనుంది. వచ్చే ఏడాది ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ప్రధాని నరేంద్రమోదీ, పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోనూ నరేంద్రమోదీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈఇద్దరు నేతల మధ్య తొలిసమావేశం ఇదే కానుంది. ఒకవేళ పాకిస్తాన్, భారత్ ప్రధానమంత్రులిద్దరూ సమావేశమైతే వీరిమధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జింగ్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్దం తరువాత ప్రపంచంలోని ప్రధాన దేశాలైన రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు ఒకే వేదికపై కలుసుకుంటున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా వివిధ దేశాల మధ్య వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవరెవరితో సమావేశమవుతారనే దానిపై అధికారికంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. షాంఘై సహకార సంస్థలో భారత్, చైనా, రష్యాతో పాటు పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్ ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. బెలారస్, ఇరాన్, మంగోలియా దేశాలు కూడా ఎస్‌సీఓ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ దేశాలు పరీశీలకులుగా ఉన్నాయి. అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ దేశాలు ఈ కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..