PM Modi: యుద్ధ పరిష్కారానికి భారత్ కృషి చేస్తుంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ
యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. ఈ సమయంలో, రష్యా సైన్యం దాడితో ఉక్రెయిన్ పోరాడుతోంది.
జపాన్‌లోని హిరోషిమాలో జీ7 సమావేశం జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా జపాన్ వెళ్లి అక్కడ క్వాడ్ గ్రూపు రాజకీయ నాయకులను కలిశారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అనంతరం ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ప్రధాని మోదీని ఆహ్వానించారు. యుద్ధం ఆరంభమైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీముఖాముఖి భేటీ అవడం తొలిసారి. హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సు ఇందుకు వేదికైంది.
ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రధాని మోదీ ఈ సదస్సుకు హజరయ్యారు.. యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా.. తమకు మద్దతివ్వాల్సిందిగా ఆయా దేశాలను కోరడానికి జెలెన్‌స్కీ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వీరిద్దరి భేటీ జరగడం విశేషం. యుద్ధ పరిష్కారానికి సాధ్యమైనంతగా భారత్ కృషి చేస్తుందని, ఆ దిశగా ఉక్రెయిన్‌కు అండగా ఉంటుందని జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ
గత ఏడాదిన్నర కాలంలో అనేక సార్లు మనం ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎట్టకేలకు ప్రత్యక్షంగా ఒకరినొకరం కలుసుకునే అవకాశం ఇప్పటికి చిక్కింది. యుద్ధ బాధ మా అందరికంటే మీకే ఎక్కువ తెలుసు. ఉక్రెయిన్‌లో జరుగుతున్నది మామూలు యుద్ధం కాదు. ప్రపంచంపై అనేక కోణాల్లో ప్రభావం చూపుతోంది. భారత్ తరఫునే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఈ సంఘర్షణకు పరిష్కారం కనుక్కోవడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని మీకు మాటిస్తున్నా. నా దృష్టిలో ఇది రాజకీయ, ఆర్థిక ఘర్షణ కాదు. మానవత్వం, విలువలకు సవాలు ఈ యుద్ధం అని జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ అనడం విశేషం.
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలింపు సమయంలో అందించిన సహాయానికి భారత ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. హిరోషిమాలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య అని, ఇది ప్రపంచంపై అనేక విభిన్న ప్రభావాలను చూపిందని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం