ఆఫ్గనిస్తాన్ పరిస్థితిపై చర్చకు అందని ఐరాస భద్రతా మండలి ఆహ్వానం.. పాకిస్తాన్ ఆగ్రహం
ఆఫ్గనిస్తాన్ లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తమను ఆహ్వానించలేదని పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెలకు గాను ప్రస్తుతం మండలికి ఇండియా అధ్యక్ష స్థానంలో ఉన్న విషయం గమనార్హం.
ఆఫ్గనిస్తాన్ లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తమను ఆహ్వానించలేదని పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెలకు గాను ప్రస్తుతం మండలికి ఇండియా అధ్యక్ష స్థానంలో ఉన్న విషయం గమనార్హం. ఆఫ్ఘన్ పరిస్థితిపై మండలి సభ్య దేశాలు న్యూయార్క్ లో చర్చలు జరుపుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ తమను ఆహ్వానించలేదని, తమ దేశంపై తప్పుడు ప్రచారం జరగడానికి ఈ మండలిని వేదికగా ఉపయోగించుకుంటున్నారని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరి ట్వీట్ చేశారు. ఆఫ్ఘన్ దేశానికి తాము పొరుగునే ఉన్నామని, ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో తాము కూడా కీలక పాత్ర వహిస్తామని ఆయన అన్నారు. ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని, ఓ రాజకీయ ఒప్పందం కుదరడమే మేలని ఆయన పేర్కొన్నారు. దోహాలో జరిగిన చర్చల్లో తాము కూడా భాగస్వామ్యం వహించామన్నారు.ఇప్పటికైనా తమ దేశాన్ని ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్టు జహీద్ హఫీజ్ చౌదరి పేర్కొన్నారు.
కాగా ఐరాసలో ఆఫ్ఘన్ శాశ్వత ప్రతినిధి గులాం ఇసాక్ జై.. పాకిస్తాన్ తీరును దుయ్యబట్టారు. పైకి ధర్మ పన్నాగాలు వల్లిస్తున్న ఆ దేశం లోలోన ఎవరికి మద్దతునిస్తున్నదో అందరికీ తెలిసిందే అన్నారాయన..బాహాటంగా తాలిబాన్లకు సపోర్ట్ ప్రకటిస్తూనే శాంతి మంత్రం పఠిస్తోందన్నారు. దోహా చర్చల్లో పాక్ వైఖరే స్పష్టంగా నిరూపితమవుతోందని ఆయన చెప్పారు. ఇలా ఉండగా కాబూల్ లో శనివారం జరిగిన బాంబు దాడిలో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఒకరు మరణించారు. ఇతడ్ని హామీదుల్లా అజీమీగా గుర్తించారని, ఇతని వాహనం వెనుక ఎటాచ్ చేసిన పేలుడు వస్తువు పేలిపోవడంతో ఆయన మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 5 గురు గాయపడ్డారన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Platelet Count: ప్లేట్‌లెట్స్ ఎందుకు తగ్గుతాయి.. ఒక వేళ తగ్గితే ప్రమాదం ఏమిటి.. వాటిని పెంచుకోవడం ఎలా.?
Wandering Elephants: ఎట్టకేలకు ఇంటికి చేరిన ఏనుగుల కథ.. 500 కి.మీ మేర ప్రయాణించి సరికొత్త రికార్డు..