Pakistan Crisis: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్

ఆదివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు కొద్దిసేపటి ముందు, అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం ఖాన్‌ సూరీ తిరస్కరించారు. ఈ విధంగా ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు.

Pakistan Crisis: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్
Imran Khan
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 03, 2022 | 2:43 PM

Pakistan Political Crisis:  క్రికెట్ ఫీల్డ్ లాగే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చివరి బంతికి ‘సిక్స్’ బాది రాజకీయ రంగాన్ని కైవసం చేసుకున్నారు. ఆదివారం అవిశ్వాస తీర్మానం(N0 Confident Motion)పై ఓటింగ్‌కు కొద్దిసేపటి ముందు, అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ(National Assembly) డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం ఖాన్‌ సూరీ తిరస్కరించారు. ఈ విధంగా ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు. దీంతో ప్రతిపక్షం ఇప్పుడు కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అయితే అప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు.

అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలను రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి సలహాలు పంపినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఎన్నికలు వచ్చి ఎవరికి కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. బయటి నుండి ఎలాంటి కుట్రలు జరగనివ్వండి, ఇలాంటి అవినీతిపరులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించకూడదన్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని ఈరోజు నా సంఘానికి చెబుతున్నానని ఆయన అన్నారు. విదేశాల నుంచి జరుగుతున్న పెద్ద కుట్ర విఫలమైందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. యావత్తు దేశం గమనిస్తుండగానే దేశద్రోహానికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీని రద్దు చేస్తే తర్వాతి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. చివరి నిమిషంలో స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌పైనా ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంతో సూరీ సభకు అధ్యక్షత వహించారు. సభలో ప్రధాని ఇమ్రాన్ లేకపోవడం గమనార్హం. సభాపతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభ వాయిదా పడింది. అదే సమయంలో నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో ప్రతిపక్షాలు ధర్నాకు దిగాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలంతా పార్లమెంట్‌లో ధర్నాకు దిగడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.

స్పీకర్‌ తీర్మానాన్ని తిరస్కరించినట్లు తెలిసిన కొన్ని నిమిషాల్లోనే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీకి సిఫార్సు చేసినట్లు ప్రకటించారు. కొత్తగా ఎన్నికలు నిర్వహణకు ఆదేశించాలని సూచించినట్లు తెలిపారు. పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చాలన్న విదేశీ కుట్రలను డిప్యూటీ స్వీకర్‌ తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అందుకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ప్రతిపక్షాలు ఖర్చు చేశాయని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నవారు వాటిని అనాథలు, పేదలకు పంచిపెట్టాలని హితవు పలికారు. పాకిస్థాన్‌ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

అంతకు ముందు ఇమ్రాన్‌ తన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఇస్లామాబాద్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆయనతో పాటు నేషనల్‌ అసెంబ్లీలో ఆయన వెంట ఉన్న మరో 155 మంది సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంలో ఓడిపోతే.. ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో వారు ఇమ్రాన్‌ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు.

Read Also…. House Demolish: నా ఇల్లు అక్రమంగా కట్టిందే.. కూల్చేయండి ప్రభుత్వానికి పౌరుడు వినతి ఎక్కడో తెలుసా..