Social Media: మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం.. సామాజిక మాధ్యమాలపై నిషేధం
సంక్షోభం, ఎమర్జెన్సీ, నిరసనలతో అట్టుడుకుతున్న పరిస్థితుల్లో శ్రీలంక(Sri Lanka) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా(Social Media) వేదికలైన వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిపై నిషేధం విధిస్తున్నట్లు..
సంక్షోభం, ఎమర్జెన్సీ, నిరసనలతో అట్టుడుకుతున్న పరిస్థితుల్లో శ్రీలంక(Sri Lanka) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా(Social Media) వేదికలైన వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో శనివారం – ఆదివారం మధ్యరాత్రి నుంచి సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను(Protest) అణచివేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్షోభ నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ వివిధ ప్రజాసంఘాలు నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వం 36 గంటల అత్యవసర పరిస్థితి విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై కూడా నిషేధం విధించడం గమనార్హం. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంతో ఆందోళనలను అణిచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి విధించినట్లు అర్థమవుతోంది.
శ్రీలంకంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆర్థిక సంక్షోభంతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆహారం, చమురు, విద్యుత్ కొరత, పెరుగుతున్న ధరలతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అధ్యక్షుడు గోటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) ఇంటిని ముట్టడించారు. దీంతో దేశంలో పరిస్థితులు చేయిదాటుతుండటం, హింస చెలరేగుతుండటంతో గోటబయ రాజపక్స శుక్రవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
శ్రీలంక ప్రజల పరిస్థితి మరింత దిగజారింది. తినడానికి తిండిలేదు.. రోగం వస్తే మందుల్లేవు.. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటడం, కాగితం కొరతతో పరీక్షలు వాయిదా, డీజిల్ విక్రయాల నిలిపివేత, 13 గంటల పాటు కరెంట్ కోతలు.. చాలా దీనంగా మారింది లంకేయుల పరిస్థితి. రోడ్డెక్కిన జనం ఆందోళనలు, నిరసనలు మిన్నంటడంతో సోమవారం వరకు కర్ఫ్యూ విధించారు. 40 వేల టన్నుల డీజిల్‌తో పాటు భారీగా బియ్యాన్ని పంపించి శ్రీలంకకు ఆపన్నహస్తం అందించింది భారత్.
Also Read
Shraddha Kapoor: ట్రెడిషినల్ వేర్ లో శ్రద్ధా కపూర్ ఉగాది ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
Andhra Pradesh: ఒకే పాఠశాలలో నలుగురు విద్యార్థినులు అదృశ్యం.. పిఠాపురంలో సంచలనంగా మారిన ఘటన
Earthquake: తిరుపతి సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు