Andhra Pradesh: ఒకే పాఠశాలలో నలుగురు విద్యార్థినులు అదృశ్యం.. పిఠాపురంలో సంచలనంగా మారిన ఘటన
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం(Pithapuram) లో బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. గత కొన్ని రోజుల నుంచి తమ కుమార్తెలు కనిపించడం లేదంటూ...
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం(Pithapuram) లో బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. గత కొన్ని రోజుల నుంచి తమ కుమార్తెలు కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేశారు. నలుగురు అమ్మాయిలు అదృశ్యమైనప్పటికీ.. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కనిపించడం లేదని ఫిర్యాదులు అందాయని, మరో ఇద్దరు అమ్మాయిల అదృశ్యంపై(Missing) ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. పిఠాపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక గత నెల 30వ తేదీన అదృశ్యమయ్యింది. ఆ రోజు ఉదయం స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పాఠశాలతో పాటు ఇంటి చుట్టుపక్కల వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాలిక స్నేహితులు, బంధువులను సంప్రదించినా వారి ఆచూకీ దొరకలేదు.
మరోవైపు.. ఇదే పాఠశాలలో పదోతరగతి చదువుతున్న మరో ముగ్గురు బాలికలు శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించకుండా పోయారు. ఇలా నలుగురు బాలికలు అదృశ్యమవడం పిఠాపురంలో కలకలం రేపుతోంది. అదృశ్యమైన విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. బాలికల అదృశ్యంపై తమకు ఫిర్యాదులు అందినట్లు పిఠాపురం పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక ఆదారాలు, సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా బాలికలు హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాలికల ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు వివరించారు.
కనిపించకుండాపోయిన ఈ నలుగురు బాలికల ప్రవర్తన బాగాలేకపోవడంతో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అంతేకాదు తల్లిదండ్రుల సమక్షంలోనే బాలికలను ఉపాధ్యాయులు మందలించారు. విద్యార్థులు ఇళ్లు వదిలి వెళ్లడానికి ఇదేమయినా కారణమా? లేక వేరే కారణాలేమయినా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
Also Read
AP: ఒకే గ్రామం.. 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం.. ఎందుకంటే..?