NASA: సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు 18 రోజులే డెడ్‌లైన్.. కలవరపడుతోన్న నాసా

అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్‌ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసాకు 18 రోజులు మాత్రమే గడువు ఉందా..? ఆ గడువు దాటితే ఏమవుతుంది? నాసాకు టెన్షన్‌ పుట్టిస్తున్న ఈ కౌంట్‌డౌన్‌ వెనుక ఉన్న అసలు కథ, వ్యథ ఏంటి?

NASA: సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు 18 రోజులే డెడ్‌లైన్.. కలవరపడుతోన్న నాసా
Nasa
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 05, 2024 | 7:15 AM

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు.. పది రోజుల మిషన్‌లో భాగంగా రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 5వ తేదీన భూకక్ష్యకు 400 కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి.. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్లు జూన్ 14వ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా.. స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. దీనికితోడు స్పేస్‌ క్రాఫ్ట్‌లోని సర్వీస్‌ మోడ్యుల్‌లో 5 చోట్ల హీలియం గ్యాస్‌ లీక్‌ అవుతోంది. దీంతో సునీతా బృందం భూమికి తిరిగి రావడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. భూమిపై వారి ల్యాండింగ్ ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. వారిని ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా శతవిధాలా ప్రయత్నిస్తోంది. నాసా టీమ్‌ భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్‌కు నెలన్నరగా మరమ్మతులు చేస్తోంది. అయితే ఆ మరమ్మతులు పూర్తి కావట్లేదు. దీంతో సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు భూమిపై తిరిగి ఎప్పుడు అడుగు పెడతారనేది సస్పెన్స్‌గా మారింది. వాళ్లు తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు నాసా నుంచి సమాధానం లేదు.

అయితే కలవర పెట్టే మరో అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ స్టార్‌ లైనర్‌ స్పేస్‌ షిస్‌కు మరమ్మతులు పూర్తి చేసి, సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లను భూమి పైకి తీసుకుని వచ్చేందుకు నాసాకు 18 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నాసా వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఐఎస్‌ఎస్‌కి అనుసంధానమై ఉన్న స్టార్‌ లైనర్‌ స్పేస్‌ షిప్‌…వ్యోమగాములను తిరిగి భూమి పైకి తీసుకుని రావాలంటే, దానిలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. భూ వాతావరణం లోకి వ్యోమ నౌక సురక్షితంగా ప్రవేశించడంలో అవి అత్యంత కీలకం పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికితోడు ఐఎస్ఎస్ డాకింగ్ పోర్ట్ లను నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే.. రాబోయే క్రూ-9 మిషన్ కు అనుగుణంగా డాకింగ్ పోర్ట్ దగ్గర స్టార్‌లైనర్‌ను అన్‌డాక్ చేయాలి. క్రూ-9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ సిద్ధమైంది. ఈ క్రూ-9 మిషన్ నలుగురు సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తుంది. అంటే వాళ్లు వెళ్లే లోపలే ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించిన స్టార్‌ లైనర్‌ స్పేష్‌ షిప్‌ను అన్‌డాక్ చేయాల్సి ఉంటుంది. అంటే సునీత, బుచ్‌లను భూమిపైకి తీసుకుని రావాల్సి ఉంటుంది.

అయితే ఆ పని ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు. రిపేర్లు పూర్తి కాకుండా స్టార్‌ లైనర్‌లో వ్యోమగాములు భూమిపై ల్యాండ్‌ కాలేరు. ఒకవేళ ఐఎస్‌ఎస్‌లోనే సునీత ఉండాలనుకుంటే..స్టార్‌ లైనర్‌ని భూమి నుంచి రాబోయే స్పేస్‌ షిప్‌ కోసం అన్‌ డాక్‌ చేయాల్సి ఉంటుంది. అది కూడా చేయలేరు. దీంతో నాసాకు పెద్ద టెన్షన్‌ మొదలైంది. ఇక స్టార్ లైనర్ వ్వోమ నౌక పనికిరాకుండా పోయినట్లయితే.. విలియమ్స్, విల్మోర్ లను తిరిగి భూమికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను నాసా అన్వేషించాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ను ఉపయోగించుకోవచ్చు. మరోవైపు అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండడం వల్ల సునీతా విలియమ్స్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండడం కూడా నాసాను కలవరపెడుతోంది.