AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Hijab Protest: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌.. 41 మంది మృతి.. 700 మంది..

Iran Anti-Hijab Protests: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌ అట్టుడుకుతూనే ఉంది. వారం రోజులైనా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్‌లో 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమీని మరణంతో మొదలైన నిరసనలు..

Iran Hijab Protest: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌.. 41 మంది మృతి.. 700 మంది..
Iran Anti Hijab Protests
Shaik Madar Saheb
|

Updated on: Sep 25, 2022 | 6:10 AM

Share

Iran Anti-Hijab Protests: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌ అట్టుడుకుతూనే ఉంది. వారం రోజులైనా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్‌లో 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమీని మరణంతో మొదలైన నిరసనలు.. దేశవ్యాప్తంగా తీవ్రస్థాయికి చేరాయి. పోలీసుల అదుపులో ఉన్న అమీనిని తీవ్రంగా కొట్టి, హింసించడం వల్లే మృతి చెందిందని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. హిజాబ్ ను మంటల్లో వేస్తూ కాలుస్తున్నారు. అంతేకాకుండా జట్టు కత్తిరించుకొని నిరసనలు తెలుపుతున్నారు. మహ్సా అమినీ హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమె మూడు రోజుల తర్వాత కస్టడీలో మరణించడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అయితే.. అనారోగ్యం కారణంగానే అమీని మరణించిందని తాము కొట్టలేదని పోలీసులు పేర్కొంటున్నారు. అమీని మరణంపై అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆమె తండ్రి అంజాద్ ఆరోపించారు. మృతురాలు ఇంతకుముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన కుమార్తె చనిపోయాక ఆమె మృతదేహాన్ని చూడడానికి వైద్యులు అనుమతించలేదని.. శవపరీక్ష నివేదికను కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమీని పాదాలపై గాయాలున్నాయని వైద్యులకు చెప్పామని.. కానీ పట్టించుకోలేదన్నారు. అమీని అనారోగ్యంతో చనిపోయిందని అధికారులు చెబుతున్నది అవాస్తవమని కొట్టిపారేశారు.

సెప్టెంబర్ 13న అమీనిని పోలీసులు నిర్బంధించినప్పుడు ఆమె తమ్ముడు పక్కనే ఉన్నాడని అంజాద్‌ తెలిపారు. పోలీసులు ఆమెను వ్యానులో కొట్టారని.. స్టేషన్‌లోనూ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తన కుమారునికి చెప్పినట్లు అంజాద్‌ వెల్లడించారు. పోలీసుల దుస్తులపై ఉండే బాడీ కెమేరాలను చూపించమని అడిగితే.. వాటిలో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పినట్లు అంజాద్ అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. అమీని అసభ్యకరమైన దుస్తులు ధరించినందుకే అరెస్ట్ చేశామన్న ఇరాన్ అధికారుల వ్యాఖ్యలపై అంజాద్ మండిపడ్డారు. అమీని ఎప్పుడూ పొడవైన గౌను వేసుకుంటుందని తెలిపారు. అమీని వచ్చే వారం విశ్వవిద్యాలయంలో చేరాల్సి ఉందని.. సెలవులకు టెహ్రాన్ వచ్చామని చెప్పారు. ఆమె ఉంటే గురువారం 23వ పుట్టినరోజు జరుపుకునేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇరాన్‌లోని హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకు 41 మంది చనిపోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. అల్లరల్లో 60 మంది మహిళలతో సహా 700 మందిని అరెస్టు చేశారు. కాగా.. అమీని మరణంపై విచారణ జరుపుతామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు. ఈ విషయంలో ఇరాన్ మీద ఆరోపణలు చేస్తూ పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని మండిపడ్డారు. అమీని మృతితో ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్‌, మాషాద్ న‌గ‌రాల్లోని విశ్వవిద్యాలయాల్లో నిర‌స‌న‌లు చెలరేగాయి. చట్టాల పేరుతో తమను అణచివేస్తున్నారని.. వివక్షపూరిత చట్టాలకు స్వస్తి పలకాలని మహిళలు హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..