Pakistan: ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ జోరు.. పాక్‌లో ముంచుకొస్తున్న మరో రాజకీయ సంక్షోభం..

pakistan News: పాకిస్థాన్‌లోని పంజాబ్  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ టెహ్రికీ ఇన్సాఫ్ (PTI) ఘన విజయం సాధించింది. అధికార పాకిస్థాన్ ముస్లీం లీగ్ - నవాజ్ (PML-N)  అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు.

Pakistan: ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ జోరు.. పాక్‌లో ముంచుకొస్తున్న మరో రాజకీయ సంక్షోభం..
Pakistan Former PM Imran Khan (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 18, 2022 | 11:44 AM

Pakistan: పాకిస్థాన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం అనివార్యంగా కనిపిస్తోంది. అత్యంత కీలకమైన పాకిస్థాన్‌లోని పంజాబ్  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ టెహ్రికీ ఇన్సాఫ్ (PTI) ఘన విజయం సాధించింది. అధికార పాకిస్థాన్ ముస్లీం లీగ్ – నవాజ్ (PML-N)  అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. పాకిస్థాన్‌‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే 16 స్థానాల్లో పీటీఐ విజయం సాధించగా.. అధికార పీఎంఎల్-ఎన్ కేవలం మూడు స్థానాలకు పరిమితమయ్యింది. ఓ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పీఎంఎల్-ఎన్‌కు చెందిన ప్రముఖ నేతలు ఓటమి చెవిచూశారు. ఈ ఫలితాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. ఈ ఫలితాలతో షెహబాజ్ షరీఫ్ తనయుడు హంజా షెహబాజ్ కూడా అక్కడ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. పాక్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి ఎన్నికను జులై 22న నిర్వహించనున్నారు. పీటీఐ – పీఎంఎల్‌క్యూ అభ్యర్థి చౌదరీ పర్వేజ్ ఎలాహి.. పంజాబ్ ప్రావిన్స్ కొత్త సీఎం కానున్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన పీఎంఎల్-ఎన్.. ఘన విజయం సాధించినందుకు ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలిపింది. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొంది. పంజాబ్‌లో పీటీఐ – పీఎంఎల్‌క్యూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రధాని అధికార ప్రతినిధి మాలిక్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తారా? అన్న ప్రశ్నకు.. పీఎంఎల్-ఎన్ నాయకత్వం అన్ని అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

పంజాబ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్ – ఎన్ ఉపాధ్యక్షురాలు మర్యం నవాజ్ ట్వీట్ చేశారు. అయితే రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని పేర్కొన్నారు. తమ ఓటమికి కారణాలను సమీక్షించుకుని, లోపాలను సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు.

అటు ఉప ఎన్నికల ఫలితాల పట్ల ఇమ్రాన్ ఖాన్ హర్షం వ్యక్తంచేశారు.పోలీసులు ఎన్ని వేధింపులకు గురిచేసినా.. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిని చూపినా తమ పార్టీ అభ్యర్థులు.. పీఎంఎల్ ఎన్ అభ్యర్థులను ఓడించారంటూ సంతోషం వ్యక్తతంచేశారు. తమ పార్టీ కార్యకర్తలు, ఓటర్లకు అభినందనలు తెలిపారు. తమ కూటమి పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్..

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి.. ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశముందని హెచ్చరించారు.

సోమవారం పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పీటీఐ సీనియర్ నేత అసద్ ఉమర్ తెలిపారు. జాతీయ అసెంబ్లీకి వెంటనే ఎన్నికలు నిర్వహించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..