AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NDA సమావేశానికి పాశ్వాన్ తనయుడు హాజరు.. మళ్లీ వేడెక్కిన బీహార్‌ రాజకీయం

Bihar Politics: బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను మార్చాలంటూ కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో.. వ్యూహాత్మకంగా ఆర్జేడీకి నితీష్ దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

NDA సమావేశానికి పాశ్వాన్ తనయుడు హాజరు.. మళ్లీ వేడెక్కిన బీహార్‌ రాజకీయం
Chirag PaswanImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Jul 18, 2022 | 12:33 PM

Share

Bihar Politics: రాష్ట్రపతి ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఢిల్లీలో ఎన్డీయే ఆదివారం నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జన శక్తి (రాంవిలాస్ పాశ్వాన్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) హాజరయ్యారు. గత కొంతకాలంగా జేడీయు నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రతిపక్ష ఆర్జేడీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలు పంపారు. రాష్ట్రంలో సీఎంను మార్చాలంటూ కొందరు బీజేపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో.. నితీశ్ కుమార్ వ్యూహాత్మకంగా ఆర్జేడీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్‌‌పై తీవ్ర విమర్శలు చేసిన బీహార్‌లో ఎన్డీయే కూటమికి చిరాగ్ పాశ్వాన్‌ దూరమయ్యారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో కొనసాగుతామని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను హనుమంతునికి చిరాగ్ పాశ్వాన్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.

నాటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు అభ్యర్థులకు పోటీగా తమ పార్టీ అభ్యర్థులను చిరాగ్ పాశ్వాన్ బరిలో నిలిపారు. అయితే బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో మాత్రం పోటీగా దూరంగా ఉన్నారు. ఎల్జేపీ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతోనే దాదాపు 30 స్థానాల్లో జేడీయు అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో చిరాగ్ పాశ్వాన్‌తో బీజేపీ సత్సంబంధాలను కొనసాగించడాన్ని జేడీయు తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాతటి పరిణామాలతో చిరాగ్ పాశ్వాన్‌, బీజేపీ మధ్య సంబంధాలు క్షీణించాయి. చిరాగ్ పాశ్వాన్ చిన్నాన్న, ఎంపీ పశుపతి కుమార్ పరాస్ సారథ్యంలో ఐదుగురు ఎంపీలతో కూడిన చీలిక వర్గాన్ని అసలైన ఎల్జేపీ గుర్తించారు. తనపై పార్టీ నేతల తిరుగుబాటు వెనుక కొందరు బీజేపీ నేతల ప్రమేయం ఉందని అప్పట్లో చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతివ్వాలని ఇటీవల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చిరాగ్ పాశ్వాన్‌ను ఫోన్‌లో కోరారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్ధతిచ్చేందుకు చిరాగ్ అంగీకరించారు. దీంతో చిరాగ్ పాశ్వాన్.. బీజేపీ మధ్య స్నేహం మళ్లీ చిగురించిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బీహార్ రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిరేపుతోంది. ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్.. తాను ఎన్డీయే కూటమిలో కానీ.. మరో కూటమిలో కానీ లేనని స్పష్టంచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్ధతు ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. తమ పార్టీ ఎప్పుడూ అణగారివర్గాలు, గిరిజనులు, వెనుకబడిన వారికి మద్ధతుగా నిలుస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక కూటమిలో తమ పార్టీ ఉంటుందని స్పష్టంచేశారు. అయితే ప్రస్తుతం తాము ఎన్డీయే, యూపీఏ, బీహార్‌లోని మహాకూటమిలో.. ఏ కూటమిలోనూ లేదని స్పష్టంచేశారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్నది ఎన్నికలకు ముందే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే సమావేశానికి హాజరుకావడంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తాజా పరిణామంపై బీహార్‌‌లో అధికార ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన జేడీయు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయోనన్నది ఉత్కంఠరేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..