Turkey Earthquake: టర్కీకి భారత్ సహాయం.. ఆకలి తీర్చే అమ్మగానే కాకుండా.. సహాయ సేవల్లో ఎన్డీఆర్ఎఫ్..
భారత్ అంటే మానవత్వానికి ప్రతిరూపం. సాయమందించాల్సిన సమయంలో తన, పరఅనే భేదాలు ముందుకు దూసుకుపోవడమే మన ప్రత్యేకత. అందుకే భారత్ అంటే అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి అని ప్రపంచం మరోసారి గుర్తించింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటుంది. అందుకే అంతర్జాతీయంగా ఎంతో గౌరవం. తాజాగా ఇప్పుడు టర్కీకి భారత్ అందిస్తున్న సాయం ఆ దేశ వాసుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
టర్కీ, సిరిమాలో సంభవించిన వరుస భూ ప్రకంపనాలు మాటలకందని విషాదాన్ని తీసుకొచ్చింది. అత్యంత ఘోర విపత్తుకు 10 రోజులు అవుతున్నా.. ఇవాళ్టికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాల శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే కనిపిస్తున్నాయి. భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలడంతో లక్షలాది మంది ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. ఉన్నవారు.. కన్నవారు ఎవరు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. వేలాది మంది విగతా జీవులుగా మారారు. మరికొందరు అయిన వారిని కోల్పోయి అనాథలుగా మిగిలి.. రోడ్డున పడ్డారు.
శిథిల తొలిగింపు ఇంకా కొనసాగుతోంది.. భవన శిథిలా కింద తమవారు అసలు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి.. అయినా ఆశ.. చలిని లెక్క చేయకుండా అక్కడే తమ వారి కోసం చూస్తూ గడిపేస్తున్నారు. టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ఎందరో చిన్నారుల్ని అనాథల్ని చేసింది. వీరిలో చాలా మంది రోజుల పసికందులే. ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో భూకంపం పిల్లల నెత్తిన పిడుగుపాటులా మారింది.
భారత్ ఆపన్నహస్తం..
కష్టకాలంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడంటారు. భూకంపంతో తల్లడిల్లుతున్న టర్కీ చేసిన వ్యాఖ్య ఇది. భారత్ తమ నిజమైన స్నేహితుడని భారత్‌లోని టర్కీ రాయబారి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దోస్త్ అనే మాటకు హిందీలో ఉన్న అర్థమే టర్కిష్ భాషలోనూ ఉంది. భారత్ అందించిన స్నేహహస్తానికి టర్కీ ధన్యవాదాలు తెలిపింది. టర్కీకి సాయమందించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ దోస్త్. ఈ నెల 6న తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో వచ్చిన భూకంపం, ఆ తర్వాత తొమ్మిది గంటల తర్వాత వచ్చిన మరో భూకంపం టర్కీలోని దక్షిణ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఆ విషయం ప్రపంచానికి తెలిసి ఆ తీవ్రత గుర్తించిన వెంటనే భారత్ స్పందించింది. టర్కీతో విభేధాలు మర్చిపోయి తక్షణమే సహాయసామగ్రిని తరలిచింది. మానవత్వాన్ని మించింది లేదని మరోసారి నిరూపిస్తూ భూకంపం సంభవించిన 24 గంటల్లోపే భారత్ నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది, వైద్య బృందాలు, NDRF టీమ్స్ టర్కీలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాయి. వసుదైక కుటుంబం అనే భావనను భారత్ తన చర్యల ద్వారా వ్యక్తీకరించింది.
కశ్మీర్ విషయంలో భారత్‌తో టర్కీ విభేదిస్తోంది. అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను టర్కీ సమర్థిస్తోంది. టర్కీ ప్రస్తుత అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ భారత్ నిజాయితీ గురించి అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దును టర్కీ వ్యతిరేకించింది. గోధుమల కన్‌సైన్‌మెంట్ విషయంలోనూ టర్కీ భారత్‌తో విభేదించి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ భారత్ అవేవి పట్టించుకోకుండా కష్టకాలంలో మానవత్వాన్ని చాటుకుంది. టర్కీకి సహాయ హస్తం అందించడం ద్వారా ముస్లింలకు భారత్ వ్యతిరేకమని అంతర్జాతీయంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది.
Kahramanmaraş Dulkadiroğlu ilçesinde arama-kurtarma çalışmaları 9. günde de devam ediyor.
Depremin 226. saatinde ekiplerimizin çalışmalarıyla enkaz altından canlı olarak çıkartılan 74 yaşındaki Cemile Kekeç teyzemizin kurtarma çalışmalarına şahitlik ettik.
?Kahramanmaraş pic.twitter.com/PtL7XOcDo6
— Muzaffer Bıyık (@muzafferbiyik) February 15, 2023
అందమైన నగరం ఇప్పుడు పూర్తిగా కళ తప్పి..
గాజియాన్‌టెప్ – టర్కీలోని ప్రముఖ నగరాల్లో ఒకటి. దక్షిణ టర్కీలో ప్రధాన నగరమిది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బక్లావా అనే స్వీట్‌కు గాజియాన్‌టెప్ నగరం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ పండించే పిస్తాకు ప్రపంచగుర్తింపు ఉంది. సిరియా సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గాజియాన్‌టెప్. దాదాపు 21 లక్షల మంది ఉండే ఈ నగరం జనాభాపరంగా టర్కీలో ఆరో అతి పెద్ద నగరం. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నగరం ఇప్పుడు భూకంపం కారణంగా శిధిలమైపోయింది. 6వేలకు పైగా భవనాలు ఇక్కడ కూలిపోయాయి. మిగిలిన భవనాల్లో చాలా వరకు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. టీవీ9 కెమెరాకు ఎటు చూసినా విషాదం, విలాపమే కనిపించిది. 12 రోజులుగా ఇక్కడ కరెంట్ లేదు. గడ్డ కట్టించే చలి ఒకవైపు, ఉండేందుకు గూడు లేక అనేక మంది అల్లాడుతున్నారు. దాతలు, అంతర్జాతీయంగా అందుతున్న సాయంతో అందిస్తుండటంతో తిండికి కొరత లేదు కాని, తాగేందుకు నీళ్ల కోసం అల్లాడుతున్న పరిస్థితి. మాకు సాయం కావాలని అక్కడి వాళ్లు అర్థిస్తున్నారు.
టీవీ 9 సాహాసం..
టర్కీలో టీవీ9 కవరేజ్ ఐదో రోజు కూడా కొనసాగుతోంది. భూకంప కేంద్రానికి అతి సమీపంలో ఉన్న చారిత్రక నగరం గాజియాన్‌టెప్‌లోకి టీవీ9 ప్రతినిధి బృందం ప్రవేశించింది. ఎంతో అందమైన నగరం ఇప్పుడు పూర్తిగా కళ తప్పింది. భూకంప కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఇప్పుడు పేరుకు మాత్రమే మిగిలింది. సిరియా యుద్ధానికి భయపడి గాజియాన్‌టెప్ నగరానికి వచ్చిన శరణార్థుల పరిస్థితి మరీ దారుణంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం