PM Modi in Italy: G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ బిజీ బిజీ.. ఫ్రాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలు, దౌత్యం ద్వారానే శాంతియుత పరిష్కారం కనుగొనేలా భారత్ కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొన్న ప్రధాని.. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలు, దౌత్యం ద్వారానే శాంతియుత పరిష్కారం కనుగొనేలా భారత్ కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొన్న ప్రధాని.. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ బిజీబిజీగా గడిపారు. పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో సమావేశమైన భారత ప్రధాని, భారత్-ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి తాము ఇచ్చే ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని తెలిపారు. రక్షణ రంగం, భద్రత, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ, తదితర రంగాలపై మేక్రాన్‌తో చర్చలు జరిపినట్టు వెల్లడించారు.
ఇక బ్రిటన్‌తో సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి అంశాలను ఆ దేశ ప్రధాని రుషి సునాక్‌తో చర్చించినట్టు తెలిపారు ప్రధాని మోదీ. సెమీకండక్టర్లు, టెక్నాలజీ, వాణిజ్యం తదితర రంగాల్లో పటిష్ఠ సంబంధాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడే దిశగా చర్చలు జరిగాయని ప్రధాని మోదీ వివరించారు.
ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ సమావేశానికి ఇరు దేశాల అధికారులు కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు అనేక అంశాలపై చర్చించుకున్నారు. జెలెన్ స్కీతో చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయని.. ఉక్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై భారత్ ఆసక్తిగా ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో శాంతి స్థాపనకు చర్చలు, దౌత్య విధానాలే మార్గమని నమ్ముతున్నామని జెలెన్ స్కీకి తెలియజేసినట్టు మోదీ వెల్లడించారు.
G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయ్యారు. గతేడాది మెలోని భారత పర్యటన సందర్భంగా చర్చించిన అంశాల కొనసాగింపుగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ సదస్సులో పాల్గొన్న పోప్ ఫ్రాన్సిస్ ప్రధాని మోదీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్ పాల్గొనడం ఇది పదకొండోసారి. వరుసగా ఐదేళ్ల నుంచి ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…