Balaraju Goud | Edited By: TV9 Telugu
Updated on: Dec 03, 2024 | 11:55 AM
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఘన స్వాగతం పలికారు. జీ-7 సదస్సులో భారత్ 'ఔట్‌రీచ్ నేషన్'గా పాల్గొంటోంది. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం (జూన్ 13)ఇటలీలోని అపులియా చేరుకున్నారు.
జీ7 శిఖరాగ్ర సదస్సులో 'ఔట్‌రీచ్ సెషన్'లో పాల్గొనేందుకు అపులుగా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ సంస్కృతి ప్రకారం నమస్కారం చేస్తూ స్వాగతం పలికారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎనర్జీ, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతంపై దృష్టి సారించి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్వహించే సెషన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
మూడోసారి ప్రధాని అయ్యిన తర్వాత తొలి విదేశీ పర్యటనకు ఇటలీ రావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో గణనీయమైన కృషి చేసిన ఇటలీ ప్రధాన మంత్రి మెలోని భారతదేశ పర్యటనను ప్రధాని గుర్తు చేసుకున్నారు.
భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ఇండో-పసిఫిక్, మధ్యధరా ప్రాంతాలలో సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని ఇరు దేశాల అధినేతలు స్పష్టం చేశారు.
ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు, ఉజ్వల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు.