Chile Former President: కుప్పకూలిన హెలికాప్టర్.. చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా దుర్మరణం
చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ దేశంలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సెబాస్టియన్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన రెండు పర్యాయాలు చిలీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు

చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ దేశంలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సెబాస్టియన్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన రెండు పర్యాయాలు చిలీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2010 నుండి 2014 వరకు, 2018 నుండి 2022 వరకు చిలీ అధ్యక్షుడిగా కొనసాగారు. 74 ఏళ్ల మాజీ అధ్యక్షుడి మరణాన్ని అంతర్గత మంత్రి కరోలినా తోహా ధృవీకరించారు. ఆయన మృతి పట్ల లాటిన్ అమెరికా నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సెబాస్టియన్ మృతితో చిలీ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.
ప్రభుత్వ అత్యవసర ఏజెన్సీ సెనాప్రెడ్ తెలిపిన వివరాల ప్రకారం, కూలిపోయిన హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయాలతో బయటపడ్డారని ఏజెన్సీ తెలిపింది. దురదృష్టావశాత్తు సెబాస్టియన్ పినెరా దుర్మరణం పాలైనట్లు ప్రకటించింది. చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ, రెస్క్యూ సేవలు పినెరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని, ప్రభుత్వం జాతీయ సంతాప దినాలను ప్రకటిస్తుందని చెప్పారు. పినెరాకు తదనుగుణంగా అన్ని గౌరవాలు, రిపబ్లికన్ గుర్తింపులు ఉంటాయని తోహా తెలిపారు. అధ్యక్షుడిగా అతను ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన విధానాన్ని మేము గుర్తుంచుకుంటామని కొనియాడారు.
2010 నుండి 2014 వరకు తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. 2018 నుండి 2022 వరకు అతని రెండవ అధ్యక్ష పదవీకాలం అసమానతకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలతో నిండిపోయింది. దీని కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. కొత్త రాజ్యాంగాన్ని రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అతని పదవీకాలంలో, 2010 సంవత్సరంలో అటాకామా ఎడారి కింద చిక్కుకున్న 33 మంది మైనర్లను రక్షించడం జరిగింది. ఈ ప్రచారం ప్రపంచ మీడియాలో సంచలనంగా మారింది. ఈ విషయంపై 2014లో “ది 33” సినిమా కూడా తీశారు.
ప్రముఖ మధ్యేతర రాజకీయవేత్త కుమారుడు సెబాస్టియన్ పినెరా. హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఆర్థికవేత్త. 1980లలో చిలీలో క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.గతంలో LAN అని పిలిచే ప్రధాన విమానయాన సంస్థ, స్థానిక ఫుట్‌బాల్ జట్టు కోలో కోలో, టెలివిజన్ స్టేషన్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. అయితే, మార్చి 2010లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అతను తన వాటాలో ఎక్కువ భాగాన్ని విక్రయించారు. 2.7 బిలియన్ల డాలర్ల నికర విలువతో, అతను ఫోర్బ్స్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో 1,176వ స్థానంలో ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
