Ethiopia Clashes: అంతర్యుద్దంతో అట్టుడుకుతున్న ఇథియోపియా.. చిక్కుకున్న తెలుగు కుటుంబాలు..
Indians trapped in Ethiopia: ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధం భారతీయుల పాలిట శాపంగా మారింది. ఇథియోపియా దేశంలోని టైగ్రే ప్రాంతంలో తిరుగుబాట్లతో ఆ ప్రాంతమంతా
Indians trapped in Ethiopia: ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధం భారతీయుల పాలిట శాపంగా మారింది. ఇథియోపియా దేశంలోని టైగ్రే ప్రాంతంలో తిరుగుబాట్లతో ఆ ప్రాంతమంతా అట్టుడుకుతోంది. సాయుధ పోరు కారణంగా తలెత్తిన అంతర్యుద్దంతో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయారు. గత 3 వారాలుగా వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో భారత్‌లోని వారి బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకుని వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని అభ్యర్థిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా దేశాల్లో విద్యా బోధన కోసం భారతదేశం నుంచి చాలామంది వెళ్లి స్థిరపడ్డారు. ఆ క్రమంలో ఇథియోపియాలోని టైగ్రే ప్రావిన్స్‌లో కూడా చాలామంది భారతీయులున్నారు. అయితే ఈ ప్రావిన్స్లో అంతర్యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ప్రావిన్స్ రాజధాని మెకేలేను తిరుగుబాటు దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో మెకేలే యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్న భారతీయుల ఆచూకీ తెలియకుండా పోయింది. చాలా కాలంగా జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఫోన్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వచ్చిపోతుండేది. అంతర్యుద్ధం కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడైతే తిరుగుబాటు దళాలు మెకేలే నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయో, అప్పటి నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిసింది. 3 వారాలుగా అక్కడున్న భారతీయుల నుంచి ఎలాంటి ఫోన్ లేదా ఇంటర్నెట్ సందేశం లేకపోవడంతో భారత్‌లోని వారి బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.
చిక్కుకున్నవారిలో అనంతరపురం వాసి.. ఇథియోపియా దేశంలోని టైగ్రే ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా చిక్కుకుపోయినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన భీమలింగేశ్వరరావు ఉన్నారు. ఆయన మెకేలే యూనివర్సిటీలో జియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్న భీమలింగేశ్వర రావు, దాదాపు 20 ఏళ్ల నుంచి ఆఫ్రికా దేశాల్లో అధ్యాపక వృత్తిలో ఉన్నారు. గత 10-12 సంవత్సరాలుగా మెకేలే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన కుటుంబంతో సహా అక్కడే స్థిరపడ్డారు. భీమలింగేశ్వరరావుతో పాటు ఇంకా చాలా మంది తెలుగువారు మెకేలే యూనివర్సిటితో పాటు పరిసర ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, పాఠశాలల్లో బోధనా వృత్తిలో ఉన్నారని తెలిసింది. వారందరి ఆచూకీ కోసం బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు. భీమలింగేశ్వరరావుతో పాటు జేఎన్యూలో చదువుకున్నవారిలో ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్ కూడా ఉన్నారు. తరచుగా వాట్సాప్ గ్రూప్ ద్వారా సంభాషించే మిత్రుడి నుంచి ఆచూకీ లేకపోవడంతో మిత్రుడి క్షేమసమాచారం కోసం ఆందోళనకు గురయ్యారు. తనకున్న పరిచయాలతో విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు.
యూనైటెడ్ నేషన్స్ సాయంతో అడ్డీస్ అబాబా చేరుకోండి: విదేశాంగ శాఖ ఇథియోపియా టైగ్రే ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులు క్షేమంగానే ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. చిక్కుకున్నవారి బంధుమిత్రుల ఆందోళన, అభ్యర్థనల నేపథ్యంలో ఆ శాఖ వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం టైగ్రే ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి బాగానే ఉందని వెల్లడించింది. అయితే ఆహారం, మందుల సరఫరాకు విఘాతం ఏర్పడి కొరత ఏర్పడుతోందని వివరించింది. ఫోన్, ఇంటర్నెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే, కొందరు ప్రొఫెసర్లు మెకేలేలోని యునైటెడ్ నేషన్స్ కాంపౌండ్‌కు వచ్చిపోతున్నారని, వారు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తమ క్షేమసమాచారాన్ని తెలియజేసే సదుపాయం ఉందని వెల్లడించింది. ఇథియోపియా రాజధాని అడ్డీస్ అబాబాలోని భారత రాయబార కార్యాలయం సేకరించిన సమాచారం ప్రకారం, టైగ్రే ప్రాంతంలో దాదాపు 100 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది. వారిలో 54 మంది మెకేలే యూనివర్సిటీలో పనిచేస్తుండగా, 24 మంది అడిగ్రాట్ యూనివర్సిటీలో, ఆరుగురు అక్సున్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారని, మిగతావారు వేర్వేరు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారని తెలిపింది. యునైటెడ్ నేషన్స్ విభాగాలు, బలగాల సహాయంతో వారందరినీ రాజధాని అడ్డీస్ అబాబాకు చేరుకోవాల్సిందిగా విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.
మహాత్మా కొడియార్, టీవీ9 తెలుగు ప్రతినిధి, ఢిల్లీ.
Also Read: