Global Democracy Index: ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. గ్లోబల్ ర్యాంకింగ్స్ విడుదల.. భారత్‌లో లోపభూయిష్టం!
ప్రపంచంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. "ది ఎకనమిస్ట్" కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రతియేటా ఈ సంస్థ ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో వివిధ విధానాలను అనుసరించి ఆయా దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కొలిచి.. అక్కడున్న పరిస్థితుల ప్రకారం ర్యాంకులు ప్రకటిస్తోంది.

ప్రపంచంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. “ది ఎకనమిస్ట్” కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రతియేటా ఈ సంస్థ ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో వివిధ విధానాలను అనుసరించి ఆయా దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కొలిచి ర్యాంకులు ప్రకటిస్తోంది. 2006 నుంచి కొనసాగిస్తున్న ర్యాంకులు ప్రకటిస్తున్న ఈ సంస్థ గత ఏడాది 167 దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కొలిచి “డెమోక్రసీ ఇండెక్స్ 2024” జాబితా రూపొందించింది. సున్నా నుంచి 10 వరకు స్కోర్ పెట్టి అత్యధిక స్కోర్ సాధించిన దేశాలకు ఉత్తమ ప్రజాస్వామ్యం కల్గిన దేశాలుగా టాప్ ర్యాంక్ ఇచ్చింది.
గత 16 ఏళ్లుగా మొదటి ర్యాంకులో కొనసాగుతున్న నార్వే ఈసారి కూడా 9.81 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో న్యూజీలాండ్, స్వీడన్ దేశాలు నిలిచాయి. అలాగే ఇండెక్స్‌లో తక్కువ స్కోర్ చేసిన దేశాలను చెత్త ప్రజాస్వామ్య దేశాలుగా పేర్కొంది. ఆ జాబితాలో భారత పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు నానాటికీ క్షీణిస్తున్నాయని కూడా ఈ నివేదిక పేర్కొంది.
ఆసియా దేశాల్లో బలహీనంగా ప్రజాస్వామ్యం
భారత్ పొరుగున ఉన్న మూడు దేశాలతో పాటు ఈ నివేదిక ప్రకారం మయన్మార్ (166), ఉత్తర కొరియా (165), చైనా (145), లావోస్ (160), వియత్నాం (133) వంటి ఇతర ఆసియా దేశాలు కూడా చెత్త ప్రజాస్వామ్య దేశాలుగా ఇండెక్స్ ర్యాంకింగ్‌లో స్థానం సంపాదించాయి. ఇండెక్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 0.25 పాయింట్లను మాత్రమే సాధించి అట్టడుగు స్థానంలో నిలిచింది. అంటే 167 దేశాల జాబితాలో ఆ దేశం సాధించిన ర్యాంక్ 167. తాలిబాన్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు దాదాపుగా కుప్పకూలినందున 2021 నుండి ఆఫ్ఘనిస్తాన్ అత్యల్ప స్థానంలో కొనసాగుతూ వస్తోంది. పౌర హక్కుల అణచివేత, మహిళల విద్య, పని ప్రదేశాల్లో మహిళల భాగస్వామ్యంపై ఆంక్షలు, మీడియా స్వేచ్ఛ లేకపోవడం వంటి అంశాలు ఈ దేశాన్ని అత్యల్ప స్థానంలో నిలబెట్టాయి.
డెమెక్రసీ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి పాకిస్తాన్ ర్యాంక్‌ను గమనిస్తే.. 6 స్థానాలు దిగజారింది. ప్రపంచంలోని మొత్తం 167 దేశాల్లో ఆ దేశం 124వ ర్యాంకు సాధించింది. ప్రజాస్వామ్యం విషయంలో అధ్వాన్నమైన పనితీరు ప్రదర్శిస్తున్న టాప్ 10 దేశాల్లో పాకిస్తాన్ ఒకటిగా చేరింది. అంటే ఆ దేశంలో ప్రతియేటా ప్రజాస్వామ్య విలువలు నానాటికీ క్షీణిస్తున్నాయని అర్థం. రాజకీయ అస్థిరత, ఎన్నికల ప్రక్రియలో మోసాలు, పాలనలో సైనిక జోక్యం పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలపై అణిచివేత, పత్రికా స్వేచ్ఛ లేకపోవడం, పారదర్శకత లేకపోవడం వల్ల ఆ దేశ పరిస్థితి నిరంతరం క్షీణిస్తోంది.
జూలై 2024లో దేశంలో ప్రారంభమైన రాజకీయ అస్థిరత అంతమయ్యే సంకేతాలను చూపించకపోవడంతో బంగ్లాదేశ్ 100వ స్థానంలో ఉంది. ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిన తర్వాత, నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. పరిస్థితిలో సానుకూల మార్పులేవీ లేకపోగా ప్రజాస్వామ్య విలువలు మరింత దిగజారాయి. హిందువులపై జరిగిన దాడులు, హింస, ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను దెబ్బతీశాయి. చివరికి ప్రజాస్వామ్య సూచిక 2024 నివేదికలో ఆ దేశ ర్యాంకింగ్‌ను ప్రభావితం చేశాయి. 2023తో పోలిస్తే బంగ్లాదేశ్ 25 పాయింట్లు దిగజారినట్టు తాజా ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.
లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల జాబితాలో భారతదేశం, అమెరికా, ఫ్రాన్స్
ఆసియా దేశాల్లో భారత్ మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా తయారు చేసిన జాబితాలో 41వ స్థానంలో నిలించింది. మెరుగైన ర్యాంకింగ్‌తో పాటు ప్రతియేటా ప్రజాస్వామ్య విలువలను పెంపొందించుకుంటూ ముందుకెళ్లే దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా వర్గీకరిస్తారు. అలాకాకుండా ప్రజాస్వామ్య విలువల్లో తేడా వచ్చి ర్యాంకు తగ్గితే.. లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాలుగా వర్గీకరిస్తారు. ప్రస్తుతం భారతదేశం లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల జాబితాలో ఉంది. ఈ నివేదిక భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫ్రాన్స్‌ను సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాల జాబితా నుంచి లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల కేటగిరీకి తగ్గించగా, 28వ ర్యాంకు పొందిన అమెరికా కంటే 26 పాయింట్లతో కాస్త మెరుగ్గా ఉంది. ఆసియాలో దక్షిణ కొరియా కూడా సంపూర్ణ ప్రజాస్వామ్య కేటగిరీ నుంచి వైదొలిగి సూచికలో 32వ ర్యాంకును పొందింది.
యూరోపియన్ సెంటర్ ఫర్ పాపులిజం స్టడీస్ (ECPS) ప్రకారం, ఎన్నికలు న్యాయబద్ధంగా, స్వేచ్ఛగా జరిగుతూ, ప్రాథమిక పౌర హక్కులను గౌరవిస్తున్నప్పటికీ.. మీడియా స్వేచ్ఛ లేకపోవడం, రాజకీయ ప్రత్యర్థులను, విమర్శకులను స్వల్పంగా అణచివేయడం వంటి పరిస్థితులు ఉంటే ఆ దేశాలను లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాలుగా వర్గీకరిస్తారు. అలాగే ఈ దేశాల్లో రాజకీయ సంస్కృతి అభివృద్ధి చెందకపోవడం, రాజకీయాల్లో తక్కువ భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం, పాలన పనితీరులో సమస్యలు కలిగి ఉండడం వంటివి ప్రజాస్వామ్యం గణనీయమైన లోపాలుగా నివేదిక చెబుతోంది.
యుద్ధంతో ప్రజాస్వామ్యం పతనం
గత కొన్నేళ్లుగా యుద్ధం చేస్తున్న దేశాల్లో ప్రజాస్వామ్య సూచిక క్షీణించింది. రష్యా – ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్యా డెమోక్రసీ ఇండెక్స్‌లో 150వ స్థానంలో నిలవగా, ఉక్రెయిన్ 92వ స్థానంలో నిలిచింది. రష్యాను నియంతృత్వ దేశంగా పేర్కొనగా.. ఉక్రెయిన్‌ను హైబ్రిడ్ పాలన అమలవుతున్న దేశంగా ఈ నివేదిక వర్గీకరించింది. ఇరాక్ సహా అనేక అరబ్ దేశాలను నిరంకుశ పాలన అమలవుతున్న దేశాలుగా నివేదిక పేర్కొంది. ఈ దేశాల్లో 2012 నుంచి స్కోర్ తగ్గుతోందని.. ఆయా దేశాల్లో సంపూర్ణ రాచరికాలు, నిరంకుశ పాలనతో పాటు కొన్ని దేశాల్లో అంతర్గత ఘర్షణల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాతినిధ్యం అత్యంత అరుదు అని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాక్ 2018లో 4.1 స్కోరుతో ఉండగా.. అది 2024 నాటికి 2.8కు క్షీణించి 167 దేశాల్లో 126వ స్థానంలో నిలిచింది.
ర్యాంకింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే?
డెమోక్రసీ ఇండెక్స్ రూపొందించేందుకు EUI స్కేలుగా 0 నుంచి 10 వరకు నిర్ణయించింది. ఇందులో అత్యుత్తమ ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూ, ప్రజాస్వామ్య విధానాలు అమలు చేస్తున్న దేశాలకు మెరుగైన స్కోరు దక్కుతుంది. ఇందుకోసం ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు, స్వేచ్ఛ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. దేశాలను నాలుగు వర్గాలుగా విభజించారు. ఆ ప్రకారం..
- సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలు (8 కంటే ఎక్కువ స్కోర్ చేసిన దేశాలు)
- లోపభూయిష్ట ప్రజాస్వామ్యాలు (6 – 8 మధ్య స్కోర్ చేసిన దేశాలు)
- హైబ్రిడ్ పాలన కల్గిన దేశాలు (4 నుంచి 6 మధ్య స్కోర్ చేసిన దేశాలు)
- నిరంకుశ / నియంతృత్వ దేశాలు (4 లేదా అంతకంటే తక్కువ స్కోర్ కల్గిన దేశాలు)
గత 2 దశాబ్దాల్లో ప్రపంచ సగటు కూడా తగ్గుతోందని నివేదిక గుర్తించింది. 2015లో ప్రపంచ సగటు స్కోరు 5.55గా ఉండగా.. అది 2024 నాటికి 5.17కు చేరుకుంది. ప్రపంచ జనాభాలో కేవలం 6.6 శాతం మంది మాత్రమే ఇప్పుడు సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాల్లో నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 12.5 శాతంగా ఉండేది. ప్రపంచ జనాభాలో ఎక్కువ భాగం, అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరు – నిరంకుశ పాలనలో జీవిస్తున్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
