AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Presidential polls: కౌన్‌ బనేగా అమెరికా ప్రెసిడెంట్‌..? ట్రంప్ వర్సెస్ బైడెన్.. హాట్‌హాట్‌ డిబేట్

Trump-Biden Debate: అమెరికా అధ్యక్ష అభ్యర్ధులుగా మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. వీరిద్దరి మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్లు ప్రారంభమయ్యాయి. క్లీవ్ ల్యాండ్ లో జరిగిన తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. చర్చ సందర్భంగా బైడెన్, ట్రంప్ మధ్య వైరం మరోసారి బయటపడింది. డిబేట్ కు హాజరైన ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేందుకు కూడా ఇష్టపడలేదు. ఈ చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు కనిపించింది. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్ధిక వ్యవస్థ, అధ్యక్షుల వయస్సు వంటి అంశాలపై ఈ డిబేట్ లో ట్రంప్, బైడెన్ మధ్య హాట్ హాట్ గా చర్చ జరిగింది.

US Presidential polls: కౌన్‌ బనేగా అమెరికా ప్రెసిడెంట్‌..? ట్రంప్ వర్సెస్ బైడెన్.. హాట్‌హాట్‌ డిబేట్
Us Presidential Polls
Shaik Madar Saheb
|

Updated on: Jun 29, 2024 | 8:53 AM

Share

Trump-Biden Debate: జో బైడెన్, డొనాల్డ్‌ ట్రంప్.. కౌన్‌ బనేగా అమెరికా ప్రెసిడెంట్‌..? ఈసారి కుర్చీ రిపబ్లికన్లదా, డెమొక్రాట్లదా.. తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. ఇప్పటికే రెండు వైపులా రాజకీయ వేడి రాజుకుంది. అమెరికన్ ఎన్నికల సంప్రదాయం ప్రకారం.. అభ్యర్థులిద్దరి మధ్య ముఖాముఖి డిబేట్ పెట్టడం కామన్. అందులో భాగంగానే.. అట్లాంటాలోని తమ హెడ్‌క్వార్టర్స్‌లో ఇద్దరి మధ్య బిగ్ డిబేట్ నిర్వహించింది CNN వార్తాసంస్థ. అటు సిట్టింగ్ ప్రెసిడెంట్‌ జో బైడెన్.. ఇటు.. మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. ఇద్దరూ పందెం పొట్టేళ్లలా తలపడ్డారు. 90 నిమిషాల పాటు సాగిన చర్చ ఒకానొక దశలో సబ్జెక్టును దాటి.. వ్యక్తిగత అంశాల మీదికి దూకేసింది.

అమెరికా ఆర్థికవ్యవస్థ, వలస విధానం, అబార్షన్‌ హక్కులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఫారిన్ పాలసీ.. ఇలా అనేక అంశాల చుట్టూ సాగింది బైడెన్-ట్రంపు మధ్య చర్చ. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రస్తావన రాగానే.. మాటామాటా పెరిగింది. బైడెన్‌ జమానాలో ఉద్యోగాల కల్పన జరగనేలేదని గట్టిగా నిలదీశారు ట్రంప్‌. కొత్త ఉద్యోగాలన్నీ కరోనా తర్వాత తిరిగి వచ్చినవేనన్నారు. అటు.. కరోనా కాలంలో ట్రంప్‌ వైఫల్యం వల్లే వేలమంది చనిపోయారని రివర్స్ ఎటాక్ చేశారు బైడెన్‌.

అమెరికా సమాజంలో గర్భవిచ్ఛిత్తి అంశం కీలకంగా మారిన నేపథ్యంలో.. ఇద్దరి మధ్య దీనిపై కూడా హాట్‌హాట్‌ చర్చ జరిగింది. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. అబార్షన్‌కి ఔషధాల వాడకంపై ఆంక్షలు ఉండబోవని హామీ ఇచ్చారు బైడెన్. అబార్షన్ అనేది సదరు మహిళకు, డాక్టర్‌కు సంబంధించిన అంశం మాత్రమేనని బైడెన్ అంటే.. గర్భవిచ్ఛిత్తిపై చట్టం చేసే అధికారాల్ని ఆయా రాష్ట్రాలకే ఇవ్వడం బెటర్ అన్నారు ట్రంప్.

ట్రంప్‌ తన జమానాలో తల్లుల నుంచి బిడ్డలను వేరు చేశారని బైడెన్‌ మండిపడ్డారు. అయితే బైడెన్‌ ఆరోపణలను ట్రంప్‌ కొట్టిపారేశారు. తమ పాలనలో అక్రమ వలసలకు అడ్డుకట్ట పడిందని ట్రంప్‌ అన్నారు. వలస విధానంపై ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. దేశ దక్షిణ సరిహద్దుల్ని బార్లా తెరిచి.. వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నారని బైడెన్‌పై ఆరోపణ చేశారు ట్రంప్. ఇదొక క్షమించరాని నేరం అని ట్రంప్ అన్నప్పుడు బైడెన్‌ వణికిపోయారు. నువ్వు సక్కర్‌వి అని ట్రంపు.. నువ్వు లూజర్‌వి అని బైడెన్‌.. పరస్పరం నిప్పులు చెరిగారు.

ఇజ్రాయెల్‌కి అమెరికా మద్దతు కొనసాగుతుందని.. యుద్ధం ముగించాల్సిన బాధ్యత హమస్‌దేనని బైడెన్ గట్టిగా వాదించారు. కానీ.. బైడెన్ చెప్పేదొకటి చేసేదొకటి అన్నారు ట్రంప్. ఆయన క్రమక్రమంగా పాలస్తీనియన్‌గా మారిపోతున్నారని సెటైర్ వేశారు ట్రంప్. నేను మరోసారి అధ్యక్షుడినైతే ఉక్రెయిన్‌ సమస్యను పరిష్కరిస్తా అని మాటిచ్చారు. ఆర్థిక వ్యవస్థ నుంచి అధ్యక్షుల వయసు దాకా ఇద్దరి మధ్యా వేడివేడి చర్చ జరిగింది. ఈ హాట్‌ డిబేట్‌లో అధ్యక్షుడు బైడెన్‌ పలుమార్లు దగ్గుతో ఇబ్బంది పడ్డారు. ట్రంప్ ఎదుట బైడెన్ నిలబడలేకపోయారని, తడబడ్డారని స్వయానా వైస్‌ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా తేల్చేశారు.