AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రోమాన్స్ బంధం మళ్లీ బలపడుతోందా..? ట్రంప్‌కు సారీ చెప్పే ముందు మస్క్ ఏం చేశారో తెలుసా..

డొనాల్డ్ ట్రంప్ – ఎలాన్ మస్క్ వార్‌కు ఇక ఎండ్ కార్డ్ పడినట్లేనా..? చెలిమి మళ్లీ చిగురించి మునుపటిలా వికసించబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ట్రంప్‌- ఎలాన్‌ మస్క్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ట్రంప్‌పై తాను చేసిన ఆరోపణలకు మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో వివాదానికి ఎండ్‌ కార్డు పడింది. మరి వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా? మస్క్‌ పోస్ట్‌పై ట్రంప్‌ రియాక్షన్‌ ఏంటి..?

బ్రోమాన్స్ బంధం మళ్లీ బలపడుతోందా..? ట్రంప్‌కు సారీ చెప్పే ముందు మస్క్ ఏం చేశారో తెలుసా..
Donald Trump Elon Musk
Shaik Madar Saheb
|

Updated on: Jun 12, 2025 | 10:45 AM

Share

విడిపోయిన ఆప్తమిత్రులు మళ్లీ కలిసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో డీల్‌కు రెడీ అంటున్నారు టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌. నాడు పాలు, నీళ్లు లాగా కలసిపోయిన వీరిద్దరూ.. కొన్నిరోజులుగా ఉప్పునిప్పు లాగా వ్యహరించారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు వీరి వివాదంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ట్రంప్‌పై తాను చేసిన తీవ్ర ఆరోపణలకు మస్క్‌ పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. అధ్యక్షుడిపై తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని.. ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ట్రంప్‌తో గొడవపై మస్క్‌ వెనక్కి తగ్గడంతో వీరి మధ్య మళ్లీ సంధి కుదిరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై వైట్‌హౌస్ కూడా స్పందించింది. అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో చేసిన వరుస పోస్టులపై బహిరంగంగా విచారం వ్యక్తం చేయడానికి కొద్దిసేపటి ముందు, ఎలోన్ మస్క్ సోమవారం రాత్రి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేశారని ది న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ బుధవారం నివేదించాయి. ఎలోన్ చేసిన ప్రకటనను అధ్యక్షుడు అంగీకరించారు.. దానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో అన్నారు. మస్క్ ఫెడరల్ కాంట్రాక్టులను ముగించాలని ట్రంప్ గతంలో చేసిన బెదిరింపుపై చర్య తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని కూడా పేర్కొన్నారు. అమెరికా రాజకీయాలు – వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన ఇద్దరు వ్యక్తుల మధ్య అసాధారణంగా వ్యక్తిగత, బహిరంగ వివాదంగా మారిన దానిలో ఈ క్షమాపణ గణనీయమైన మార్పును సూచిస్తుందని రాజకీయ వేత్తలు పేర్కొంటున్నారు.

ట్రంప్ గెలుపు కోసం అన్ని విధాలుగా సహాయం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ముందు నుంచి ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ డబ్బు నుంచి టెక్నాలజీ వరకు అన్ని విధాలుగా సహాయం అందించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన డోజ్‌కు సారథ్యం వహించారు. అయితే అమెరికా ప్రభుత్వం రూపొందించిన ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ను మస్క్‌ వ్యతిరేకించడంతో ట్రంప్‌తో దూరం పెరిగింది. ఇదే సపమయంలో ట్రంప్‌పై మస్క్‌ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌ తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు. ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని , జేడీ వాన్స్‌కు అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని కోరారు. తన మద్దతు లేకపోయి ఉంటే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మస్క్‌.

ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరిక

అయితే ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలకు అదే స్థాయిలో ట్రంప్‌ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్‌ సాయం తీసుకోలేదన్నారు. మస్క్‌ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినన్నారు. అంతేకాకుండా మస్క్‌ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. మస్క్‌ వ్యాఖ్యలను పలువురు ప్రముఖులు తప్పుపట్టారు. దీంతో ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టును మస్క్‌ తొలగించారు. దీంతో ట్రంప్ – ఎలాన్ మస్క్ మధ్య వార్‌కు ఎండ్ కార్డ్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. మరి డోజ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న మస్క్‌.. మళ్లీ ఆ బాధ్యతలో కొనసాగుతారా? బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు మద్దతు ప్రకటిస్తారా.? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు మస్క్‌ సారీ చెప్పడంతో ట్రంప్‌ రియాక్షన్‌ ఎలా ఉండబోతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.