రష్యన్ నేషనల్ పార్కులో దారుణం…16 ఏళ్ళ బాలుడిపై ఎలుగుబంటి దాడి… కాల్చి చంపిన రేంజర్లు
రష్యాలోని నేషనల్ పార్కులో దారుణం జరిగింది. ఓ బ్రౌన్ బేర్ ( ఎలుగుబంటి) 16 ఏళ్ళ కుర్రాడిపై దాడి చేసి చంపి...తినేసింది.
రష్యాలోని నేషనల్ పార్కులో దారుణం జరిగింది. ఓ బ్రౌన్ బేర్ ( ఎలుగుబంటి) 16 ఏళ్ళ కుర్రాడిపై దాడి చేసి చంపి…తినేసింది. తమతో వచ్చి కనబడకుండా పోయిన ఈ బాలుడి కోసం ఇద్దరు టూరిస్టులు సుమారు రెండుగంటల సేపు గాలించగా ఒక చోట ఛిద్రమైన బాలుడి మృతదేహం కనిపించింది. అక్కడికి సమీపంలోనే ఉన్న ఎలుగు వీరిపై కూడా ఎటాక్ చేయగా ఒకరు తనదగ్గరున్న పెన్ నైఫ్ తో దాని గొంతులో పొడిచాడని మరో టూరిస్టు భయంతో పరుగెత్తి కొంతదూరంలో ఉన్న రేంజర్లకు ఈ విషయం చెప్పాడని తెలిసింది. ఎలుగు దాడిలో ఆ టూరిస్టు కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలియవచ్చింది. రేంజర్లు తమ గన్ తో ఎలుగుపై కాల్పులు జరపగా గాయపడినప్పటికీ అది తప్పించుకుని పారిపోయింది. బాలుడి మృతదేహాన్ని రేంజర్లు ఖననం చేశారు.. కాగా మళ్ళీ అదే ప్రాంతానికి తిరిగి వచ్చిన ఎలుగుపై అప్రమత్తంగా ఉన్న రేంజర్లు కాల్పులు జరపడంతో అది మరణించిందని అధికారులు తెలిపారు,
సామాన్యంగా మంగోలియా సరిహద్దుల్లోని సౌత్ రష్యాలో గల ఏర్గ్ కీ నేషనల్ పార్కులో ఎలుగులు అతి క్రూరమైనవని రేంజర్లు తెలిపారు. ఈ ఎలుగు బారిన పడిన బాలుడు ఈ కొండ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు కాచుకునే వాడని తెలిసిందన్నారు. మనుషులు కనిపించగానే వెంటననే ఎలుగుబంట్లు దాడి చేస్తాయని, ఇక్కడ ప్రమాదకరమని బోర్డు పెట్టినా కొందరు దాన్ని పట్టించుకోకుండా వచ్చి ఇలా వాటి బారిన పడుతుంటారని వారు చెప్పారు.