Russia Ukraine War: ఉక్రెయిన్ దాడుల్లో అమెరికన్ జర్నలిస్ట్ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ యుద్దంలో వేలమంది సైనికులతో పాటు సామాన్య జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ యుద్దంలో వేలమంది సైనికులతో పాటు సామాన్య జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రష్యన్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ అమెరికన్ జర్నలిస్ట్ మృతిచెందాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో అమెరికా ‘ది న్యూయార్క్ టైమ్స్’కు చెందిన బ్రెంట్ రెనాడ్ అనే జర్నలిస్ట్ మృతి చెందాడు. ఐడీ, పాస్‌పోర్టు సాయంతో ఆయనను గుర్తించారు. అయితే ఈ దాడిలో మరో జర్నలిస్ట్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు కీవ్ పోలీసులు తెలిపారు. వెంటనే అతడిని కీవ్ నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గాయపడ్డ అమెరికన్ జర్నలిస్ట్ ఈ విధంగా చెప్పాడు. ‘కీవ్‌కు సమీపంలోని ఒక చెక్‌పాయింట్ వద్ద తనతో పాటు ఒక అమెరికన్ సహోద్యోగిపై రష్యన్ సైనికులు కాల్పులు జరిపారని చెప్పాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం నుంచి పారిపోతున్న శరణార్థులను తాము కవర్ చేస్తున్నామని చెప్పాడు. అప్పుడే రష్యా సైనికులు కాల్పులు జరిపారని దీంతో కారు బోల్తా పడిందని వివరించాడు’ అయితే రష్యా సైనికులు ఆగకుండా కారుపై కాల్పులు జరపడంతోనే జర్నలిస్టు మరణించాడని కీవ్ పోలీసులు ధ్రువీకరించారు.
గత రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతోన్న బ్రెంట్.. పలు దేశాల్లో యుద్ధవాతావరణ సంఘటనల కవరేజీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఆదివారం పోలిష్ సరిహద్దు సమీపంలో రష్యా వైమానిక దాడుల్లో 35 మంది మరణించారు. కాగా 57 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడిని రష్యా బలగాలు తీవ్రతరం చేశాయి. లివ్ నగరంలో రష్యా ఎనిమిది పెద్ద దాడులను నిర్వహించిందని ఇందులో విస్తృతంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ప్రపంచానికి చూపించేందుకు దాదాపు 1300 మంది అంతర్జాతీయ మీడియా సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.