Afghan Crisis: అఫ్గాన్‌లో దారుణం.. 9 ఏళ్ల కూతురిని 55 ఏళ్ల ముసలాడికి అమ్మేసిన తండ్రి..
తాలిబన్ల పాలనతో అఫ్గానిస్థాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా సహకారం నిలిచిపోవడంతో దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది..
తాలిబన్ల పాలనతో అఫ్గానిస్థాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా సహకారం నిలిచిపోవడంతో దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఇక ఆడపిల్లల భవిష్యత్ పూర్తిగా ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో కొందరు వివిధ కారణాలతో తమ ఆడబిడ్డలను కూడా అమ్ముకుంటున్నారు. తాజాగా ఇలాంటి హృదయ విదారక సంఘటన ఒకటి అక్కడి దీన పరిస్థితులకు అద్దం పడుతోంది.
కుటుంబ పోషణ కోసం తప్పడం లేదు.. బద్ఘిస్ ప్రావీన్స్‌కు చెందిన అబ్దుల్ మాలిక్ తన కుటుంబ పోషణ కోసం రెండు నెలల క్రితం తన 12 ఏళ్ల కూతురిని అమ్మేశాడు. ఇప్పుడు రెండో కూతురికి కూడా అదే గతి పట్టించాడు . అది కూడా 55 ఏళ్ల ఓ ముసలాడికి పెళ్లి చేసి.’ నా కూతుళ్లను అమ్మాలనుకున్న నిర్ణయం నన్ను నిలువునా దహించివేస్తోంది. సభ్య సమాజం నన్ను దారుణంగా చూడవచ్చు. కానీ నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదు’ అని ఆ తండ్రి చెబుతున్న మాటలు అతని నిస్సహాయ స్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక ముసలాడితో వెళ్లిపోయిన తొమ్మిదేళ్ల పర్వాన్ మాలిక్ బాగా చదివి టీచర్ అవ్వాలనుకుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె ఆశలకు కళ్లెం వేశాయి. ‘ నేను బాగా చదివి టీచర్ అవ్వాలనుకున్నాను. కానీ నా కల నెరవేరేలా కనిపించడం లేదు. పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది. నన్ను పెళ్లి చేసుకోబోయే వృద్ధుడు నన్ను చదువుకోనివ్వకుండా ఇంటికే పరిమితం చేస్తాడేమోననిపిస్తోంది. చాలామంది లాగే నన్ను కూడా చితకబాదుతాడేమోనని భయంగా ఉంది’ అని దీనంగా చెబుతోంది పర్వాన్ మాలిక్.
నా బిడ్డను కొట్టద్దు.. తండ్రితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బద్ఘిస్ ప్రావీన్స్‌లో ఉన్న పర్వాన్‌ను తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ 55 ఏళ్ల వృద్ధుడు. దీనికి బదులుగా అబ్దుల్ కుటుంబానికి రెండు లక్షల అఫ్గానీలు విలువ చేసే గొర్రెలు, భూమి, నగదును ఇచ్చాడు. ఈ సందర్భంగా కూతురును ముసలాడితో పంపిస్తూ ‘ నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో.. తను ఇంకా చిన్న పిల్ల..కొట్టవద్దు’ అని దీనంగా వేడుకున్నాడు. ఇక్కడే కాదు ఈ ప్రావీన్స్‌కు సమీపంలో ఉన్న ఘోరీ ప్రావీన్స్‌లో కొద్ది రోజుల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. పదేళ్ల అమ్మాయిని 70 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇలా ఆడపిల్లల అమ్మకాలపై మానవ హక్కుల సంఘం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు చొరవచూపి అఫ్గాన్ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.