మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన లెబనాన్.. 15 మంది మృతి!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లు, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఈ దాడుల్లో కనీసం 15 మంది మరణించినట్లు సమాచారం.

ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోందని, దానికి ప్రతిస్పందనగానే ఈ దాడులు చేపట్టామని పేర్కొంది. రాత్రి వేళల్లో దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపినట్లు, పరిస్థితిని బట్టి ఆపరేషన్లు కొనసాగుతాయని సైనిక అధికారులు వెల్లడించారు.
ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రతినిధులతో కలిసి శాంతి అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్‌పై, అలాగే లెబనాన్ సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల్లోనే ఇజ్రాయెల్ దాడులు జరగడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కూడా వాయిదా పడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ పూర్తిగా అమలయ్యే వరకు తాము ఒప్పందంలోని నిబంధనలను ఏకపక్షంగా అమలు చేయబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, కఫర్ టెబ్నిట్ సమీపంలో డ్రోన్ దాడిలో ఇద్దరు, జబాదిన్ ప్రాంతంలో మరో వ్యక్తి మరణించినట్లు లెబనీస్ మీడియా పేర్కొంది. మరోవైపు, ఇజ్రాయెల్ దాడులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని హిజ్బుల్లా ప్రకటించింది. డ్రోన్లు, రాకెట్లు, ఫిరంగులతో ప్రతిఘటించి ఇజ్రాయెల్ బలగాల ముందడుగును అడ్డుకున్నామని వెల్లడించింది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..