AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?

తెనాలిలో బంగారు ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు రెక్కీ నిర్వహించి మరీ చోరీకి యత్నించారు. గంగానమ్మపేట బజారులో నాలుగు షాపుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించినప్పటికీ, షాపు యజమానులు ఏర్పాటు చేసిన లాకర్లు, ఆధునిక భద్రతా వ్యవస్థల కారణంగా భారీ చోరీ తప్పింది.

Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?
Burglary Attempt
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 12:57 PM

Share

తెనాలిలో బంగారు ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుసగా చోరీలకు యత్నించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ముందుగా రెక్కీ నిర్వహించి, ఆ తర్వాత పక్కా ప్రణాళికతో షాపుల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే షాపు యజమానులు తీసుకున్న భద్రతా చర్యల కారణంగా ఈసారి దొంగలు పెద్దగా ఏమీ దోచుకోలేక రిక్తహస్తాలతో పారిపోయారు. ఈ ఘటనలో కేవలం 50 గ్రాముల వెండి ఆభరణాలు మాత్రమే అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయం వెనుక ఉన్న బజారులో అర్ధరాత్రి సమయంలో ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేయడానికి లేదా వాటి దిశను మార్చడానికి ప్రయత్నించిన దొంగలు, వెంట తెచ్చుకున్న ఇనుప పరికరంతో వరుసగా మూడు షాపుల షట్టర్లు తెరవాలని యత్నించారు. కానీ అవి తెరుచుకోకపోవడంతో చివరకు విజయలక్ష్మీ జ్యూయలర్స్‌లోకి చొరబడ్డారు.

షాపులోని విలువైన బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, అవన్నీ లాకర్లలో భద్రంగా ఉండటంతో వాటిని తెరవడం దొంగలకు సాధ్యపడలేదు. దీంతో బయట ఉన్న సుమారు 50 గ్రాముల వెండి ఆభరణాలను మాత్రమే తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తుండటంతో పాటు గూర్ఖా అప్రమత్తం కావడం కూడా దొంగలకు ప్రతికూలంగా మారింది. గూర్ఖా సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా అప్పటికే దొంగలు తప్పించుకున్నారు. ఘటనకు ముందు ఇదే ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై రెక్కీ నిర్వహించిన ఆనవాళ్లను పోలీసులు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు.

కాగా, ఇదే బజారులో గతంలో కూడా చోరీలు జరగడంతో వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఇటీవల జ్యూయలరీ షాపుల యజమానులు ఏర్పాటు చేసిన లాకర్లు, ఆధునిక భద్రతా తాళాలు, సీసీటీవీ కెమెరాలు వంటి రక్షణ చర్యల వల్ల ఈసారి భారీ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వరుస చోరీ యత్నాల నేపథ్యంలో బజార్ ప్రాంతంలో రాత్రి వేళల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us