‘ఆంక్షలకు అమెరికా బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్ ఘాటు రియాక్షన్
అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అమెరికా ఆంక్షలకు బానిసగా మారిందని, వీటి ద్వారా తమను లొంగదీసుకోలేరని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు. దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైన ప్రతిసారీ వాషింగ్టన్ ఆంక్షల బాట పడుతోందని ఆయన ఆరోపించారు..

ఇరాన్ ఆర్థిక నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికా కొత్త ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇరాన్ నాయకత్వంపై ఆర్థిక ఒత్తిడి ప్రభావం చూపుతోందని, ఈ చర్యలు తమ లక్ష్యాన్ని సాధించడంలో కీలకంగా ఉన్నాయని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అమెరికా చర్యలపై బఘాయీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ఇరాన్‌ను ఆర్థిక ఆంక్షలతో ‘ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని’ అమెరికా ట్రెజరీ కార్యదర్శి చెప్పుకోవడం.. అమెరికాకు ఆంక్షలపై ఉన్న వ్యసనాన్ని స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.
దౌత్యపరమైన మార్గాల్లో తమ లక్ష్యాలను సాధించలేనప్పుడు అమెరికా ఆంక్షలను ఆశ్రయిస్తోందని బఘాయీ ఆరోపించారు. ఆంక్షలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే వాటిని మరింత కఠినతరం చేస్తోందని అన్నారు. వాషింగ్టన్ దౌత్యాన్ని కొనసాగించడంలో విఫలమైన ప్రతిసారీ ఆంక్షల వైపు వెళ్తుంది. ఆ ఆంక్షలు ఫలితాలను ఇవ్వకపోతే.. మోతాదును మరింత పెంచుతుందని బఘాయీ విమర్శించారు. ఇది ఇకపై విధానం కాదని, ఒక అలవాటుగా మారిందని ఆయన అన్నారు. అంతకుమించి.. ఆలోచనను కూడా ఆ అలవాటు ఆక్రమించేసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ ఇరాన్ ఎప్పటికీ లొంగిపోలేదని బఘాయీ పేర్కొన్నారు. ఆంక్షలతో తమ దేశాన్ని లొంగదీసుకోవచ్చన్న అమెరికా వాదనలను ఆయన తోసిపుచ్చారు. అమెరికా నుంచి వస్తున్న పాత హెచ్చరికలు, ఒత్తిడి వ్యూహాలు ఇప్పుడు ప్రభావం కోల్పోయాయని ఆయన అన్నారు. ఆర్థిక ఒత్తిడిని కొనసాగించడం వల్ల ఇరాన్‌పై ప్రభావం చూపడం కంటే అమెరికాకే నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
The US Secretary of the Treasury has boasted of “suffocating” Iran through economic sanctions.
Beyond its sheer pathos, the claim is a stark testament to America’s compulsive addiction to sanctions. Whenever Washington proves itself incapable of pursuing diplomacy, it retreats…
— Esmaeil Baqaei (@IRIMFA_SPOX) August 10, 2026
‘అవమానకర ముగింపుకు దారితీయొచ్చు’
ఆంక్షలపై అమెరికా రాజకీయ నాయకులు అదే వైఖరిని కొనసాగిస్తే.. ఇరాన్‌తో కొనసాగుతున్న సంక్షోభానికి గౌరవప్రదమైన పరిష్కారం కనుగొనే అవకాశాలను అమెరికానే కోల్పోతుందని బఘాయీ హెచ్చరించారు. ఈ చెడు అలవాటుకు కట్టుబడి ఉండే అమెరికా రాజకీయ నాయకులు.. చివరకు తమ దేశమే సృష్టించుకున్న సంక్షోభం నుంచి తక్కువ అవమానకరమైన రీతిలో బయటపడే మిగిలిన అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా కొత్తగా విధించిన ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం తీవ్రతరమైంది.




