Reliance: ధీరూభాయ్ అంబానీ నుంచి ముఖేష్ అంబానీ వరకు.. భారతదేశ అభివృద్ధిలో ‘రిలయన్స్’ చెరగని ముద్ర
ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్ అంటే కేవలం కొద్దిమంది కోటీశ్వరులు, ప్రముఖ వ్యాపార కుటుంబాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఈ పరిస్థితులను పూర్తిగా మార్చేశారు ధీరూబాయ్ అంబానీ . స్టాక్ మార్కెట్ ను సామాన్యులకు కూడా చేరువ చేశారాయన. త్వరలోనే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రూపంలో జియో ప్లాట్‌ఫామ్స్ ముందుకొస్తున్న నేపథ్యంలో ధీరూబాయ్ అంబానీ స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ఒకసారి తెలుసుకుందాం రండి.

గుజరాత్‌లోని చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం 17 ఏళ్ల వయసులో యెమెన్‌లో పెట్రోల్ బంకులో పనికి చేరారాయన. అనంతరం ముంబైకి చేరుకుని చిన్న వ్యాపారంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అపారమైన ఆశయం, కష్టపడే తత్వం, సాహసోపేత నిర్ణయాలు ధీరూభాయ్ అంబానీని పారిశ్రామిక దిగ్గజంగా నిలబెట్టాయి. 1977లో రిలయన్స్ పబ్లిక్ ఇష్యూ భారతీయ పెట్టుబడుల చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. సాధారణ ప్రజలు కూడా కంపెనీల అభివృద్ధిలో భాగస్వాములై, సంపదను సృష్టించగలరనే విశ్వాసాన్ని ధీరూభాయ్ కల్పించారు. రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ ఐపీవో కారణంగా కంపెనీ షేర్ల జారీ అంచనాలను మించి ఏడు రెట్లు అధికంగా సబ్ స్క్రైబ్ అయ్యింది. చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టిన అనేక కుటుంబాలు రిలయన్స్ ఎదుగుదలలో భాగస్వాములయ్యాయి. వ్యాపార విజయాల్లో సామాన్యులకు కూడా వాటా ఉండవచ్చని ఆయన నిరూపించారు. వార్షిక నివేదికలు, డివిడెండ్లు, బోనస్ షేర్ల ద్వారా ఆ కంపెనీ ప్రగతిని స్వయంగా చూసే అవకాశం వారికి దక్కింది. భారతదేశంలో ప్రపంచస్థాయి రిఫైనరీ నిర్మించాలన్న ధీరూభాయ్ ఆశయాన్ని ముఖేష్ అంబానీ జామ్‌నగర్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ద్వారా మరింత విస్తరించారు. భారీ పారిశ్రామిక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తూ, భారత పారిశ్రామిక సామర్థ్యానికి కొత్త గుర్తింపును తీసుకొచ్చారు.
జియోతో డిజిటల్ విప్లవం
2016లో జియో ప్రవేశంతో టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ధరలకు డేటా అందుబాటులోకి రావడంతో కోట్లాది మంది భారతీయులకు డిజిటల్ సేవలు చేరువయ్యాయి. విద్య, వైద్యం, వ్యాపారం, సమాచార రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని విస్తరించడం ద్వారా డిజిటల్ భారత నిర్మాణానికి జియో తన వంతు తోడ్పాటును అందించింది. .ఇక షేర్ మార్కెట్‌ను సామాన్యుల ఇళ్లలోకి తీసుకొచ్చిన ధీరూభాయ్ వారసత్వాన్ని ఆయన కుమారుడు ముఖేష్ అంబానీ అలాగే మనవళ్లు, మనవరాళ్లు కూడా కొనసాగిస్తున్నారు. రిటైల్, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు సంస్థ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు, నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో సేవలందిస్తోంది. చోర్వాడ్ నుంచి ప్రపంచ వేదిక వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం ఒక వ్యాపార కుటుంబ కథ కాదు. భారతీయుల ఆశయాలు, ఆవిష్కరణలు, ఆర్థిక అభివృద్ధితో ముడిపడిన ప్రస్థానం.
ఇక త్వరలో దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రూపంలో జియో ప్లాట్‌ఫామ్స్ (Jio IPO) ముందుకొస్తోంది. 2008 తర్వాత రిలయన్స్ గ్రూపు నుంచి వస్తున్న తొలి ఐపీవో ఇదే కానుండడంతో ఇప్పుడిది భారత వ్యాపార రంగంలో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నెల 21న ప్రారంభంకానున్న వాటాల విక్రయం ఈ నెల 23న ముగియనున్నదని కంపెనీకి సంబంధించిన వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ నెల చివర్లో లిస్ట్ కానున్న జియో ప్లాట్‌ఫామ్ విలువ 143-146 బిలియన్ డాలర్లు లేదా రూ.12 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
