Andhra: ఇంట్లో ఉన్నప్పుడేమో ఒకటి.. బయటకు వచ్చేసరికి 2.. ఏమైందంటే..?
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలోని ఓ ఇంట్లో అరుదైన కింగ్ కోబ్రా కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జెర్రిపోతు పామును మింగడంతో కదలలేని స్థితికి చేరిన కింగ్ కోబ్రాను అటవీశాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇలాంటి విషసర్పాలు కనిపిస్తే భయపడకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో అరుదైన కింగ్ కోబ్రా సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామంలోని ఓ ఇంట్లో భారీ పాము కనిపించడంతో ఇంటి యజమానులు వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది స్నేక్ క్యాచర్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పామును పరిశీలించారు. ఇంట్లోకి ప్రవేశించినది సాధారణ నాగుపాము కాదని, అరుదైన కింగ్ కోబ్రా అని గుర్తించారు. అయితే అది కదలలేని స్థితిలో ఉండటంతో మరింత అప్రమత్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
పరిశీలనలో కింగ్ కోబ్రా ఇంట్లో దాక్కున్న జెర్రిపోతు పామును వేటాడి పూర్తిగా మింగేసినట్లు అధికారులు గుర్తించారు. భారీ ఆహారాన్ని మింగడంతో అది కదలలేని స్థితికి చేరిందని తెలిపారు. అనంతరం ప్రత్యేక పరికరాల సహాయంతో కింగ్ కోబ్రాను సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. అడవిలో విడిచిపెట్టే ముందు కింగ్ కోబ్రా మింగిన జెర్రిపోతు పామును బయటకు కక్కించింది. అయితే అప్పటికే అది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ రెస్క్యూ ప్రక్రియను స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ, కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పాల్లో ఒకటని, ఇది ప్రధానంగా ఇతర పాములనే ఆహారంగా తీసుకుంటుందని వివరించారు. మనుషులపై స్వయంగా దాడి చేయడం చాలా అరుదని, ఇలాంటి పాములు కనిపిస్తే వాటిని చంపేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పాముకు ఎలాంటి హాని కలగకుండా రెస్క్యూ నిర్వహించేందుకు సహకరించిన వత్తాడ గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అభినందించారు. ఈ ఘటన మరోసారి అడవి జీవుల సంరక్షణతో పాటు వాటి పట్ల అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
