మెడికో ప్రియాంక కుటుంబానికి జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ భారీ ఆర్థిక సాయం!
కారు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ రూ.20 లక్షల సాయం ప్రకటించింది. డెర్మటాలజీ పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రియాంకకు కాలేజీ సంతాప సభ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం కూడా రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆమె చదువుతున్న జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ అండగా నిలిచింది. కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో ప్రియాంక సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ఎండీ డాక్టర్ గన్ని సందీప్ మాట్లాడుతూ.. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రియాంక కుటుంబానికి అండగా ఉండేందుకు సంస్థ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రియాంక జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ ఫస్టియర్ చదువుతున్నట్లు కాలేజీ వర్గాలు తెలిపాయి. ఆమెను కాపాడుకునేందుకు తండ్రి, కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాల్లో తమ సంస్థ మొదటి నుంచి అండగా నిలిచిందని గన్ని సందీప్ పేర్కొన్నారు. జీఎస్‌ఎల్ డెర్మటాలజీ విభాగానికి చెందిన వైద్యులు, విద్యార్థులు త్వరలో హైదరాబాద్ వెళ్లి ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు గన్ని సందీప్ తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గన్ని సాధిక కుటుంబానికి రూ.20 లక్షల చెక్కును అందజేస్తారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు.
మరోవైపు హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ప్రియాంక మృతదేహాన్ని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం ఆమె అంతిమయాత్ర నిర్వహించారు. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజతో పాటు చేనేత కార్మికులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం తరఫున మరో రూ.20 లక్షలు
ఏపీ మంత్రి టీజీ భరత్ కూడా ప్రియాంక భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చెక్కును ప్రియాంక తండ్రి వెంకటేశ్‌కు అందజేశారు. ఈ ఘటనకు కారణమైన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రియాంక ఆసుపత్రిలో పొందిన చికిత్సకు అయిన వైద్య ఖర్చులతో పాటు ఆమె మెడికల్ సీటుకు సంబంధించిన ఖర్చులను కూడా అందిస్తామని తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
