Snakes: చలికాలంలో పాములు ఎక్కడికి వెళ్తాయి.. మాయమవడం వెనకున్న రహస్యం ఏంటో తెలుసా..?
చలికాలంలో పాములు కనిపించవు కాబట్టి మనం సేఫ్ అని అనుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. నిజానికి ఎండాకాలం కంటే చలికాలంలోనే పాములు అత్యంత దూకుడుగా, ప్రమాదకరంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చలికాలంలో పాములు ఎందుకు కనిపించవు..? ఎక్కడికి వెళ్తాయి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవి లేదా వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో పాములు కనిపించడం సహజం. కానీ చలికాలం రాగానే ఇవన్నీ అకస్మాత్తుగా మాయమైపోతాయి. అసలు ఈ పాములు ఎక్కడికి వెళ్తాయి.. ఏదైనా మంత్రదండం వేసినట్లు ఎందుకు కనిపించవు? అనేది డౌట్లు చాలా మందికి ఉంటాయి. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రేవా వెటర్నరీ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.కె. మిశ్రా విశ్లేషణ ప్రకారం.. పాములు చల్లని రక్త జంతువులు. అంటే ఇవి తమ శరీర ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోలేవు. బయట చలి పెరిగితే వీటి శరీరంలోని రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఈ స్థితిలో పాములకు కనీసం కదలడం కూడా కష్టమవుతుంది.
ఆకలి ఉన్నా వేటాడలేవు.. ఎందుకంటే..?
చలికాలంలో పాముల జీవక్రియ చాలా నెమ్మదిస్తుంది. దీనివల్ల వాటి శరీరంలో శక్తి ఉత్పత్తి కాదు. పాములకు ఆకలి వేసినప్పటికీ, కదిలే శక్తి లేక అవి వేటాడలేవు. అందుకే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవి నిద్రాణస్థితి లోకి వెళ్తాయి. చలికాలంలో పాములు కనిపించవు కాబట్టి ప్రమాదం లేదని అనుకుంటే పొరపాటే. నిజానికి ఈ సమయంలో పాములు చాలా చిరాకుగా, దూకుడుగా ఉంటాయి. చలి వల్ల అవి ఒక రకమైన పొగమంచు వంటి స్థితిలో ఉంటాయి. పొరపాటున ఎవరైనా వాటిపై కాలు వేస్తే అవి తమ దంతాల్లోని విషం మొత్తాన్ని ఒకేసారి కాటు ద్వారా శరీరంలోకి వదులుతాయి. సాధారణ రోజుల్లో కంటే చలికాలంలో వేసే కాటు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజుకు 22 గంటల నిద్ర
సాధారణ రోజుల్లో పాములు రోజుకు 16 గంటలు నిద్రపోతే.. చలికాలంలో అది 20 నుండి 22 గంటలకు చేరుకుంటుంది. ఎలుగుబంట్లు లాగానే ఇవి కూడా సురక్షితమైన, వెచ్చని ప్రదేశాల కోసం వెతుకుతాయి. గడ్డివాములు, ధాన్యాల కుప్పలు, కట్టెల మోపులు లేదా పాత సామాన్లు ఉన్న గదులు, భూమి లోపల వెచ్చగా ఉండే మూలల్లో పాములు ఉంటాయి. కొండచిలువలు వంటి పెద్ద పాములు అయితే చలికాలం మొత్తం కదలకుండా ఒకే చోట నిద్రపోతాయి. గతంలో తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తితోనే ఇవి మనుగడ సాగిస్తాయి. చలి తగ్గి వాతావరణం వేడెక్కిన తర్వాతే పాములు మళ్లీ బయటకు వస్తాయి. కాబట్టి ఇంటి పరిసరాల్లోని వెచ్చని ప్రదేశాలు, పాత సామాన్లు లేదా కట్టెల కుప్పల వద్ద జాగ్రత్తగా ఉండటం మంచిది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




