ఒక్క గ్లాసు నిమ్మరసం.. ప్రపంచ చరిత్రను ఎలా మార్చిందో తెలుసా..?
Lemon: ఒక సాధారణ నిమ్మరసం గ్లాసు వెనుక.. సామ్రాజ్యాల గమనాన్ని మార్చిన మహా చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా? ఒకప్పుడు నావికులను మృత్యువు అంచున నిలబెట్టిన భయంకరమైన వ్యాధిని నయం చేసి, ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన ఈ చిన్ని నిమ్మకాయ'కథ అత్యంత ఆసక్తికరం. ఆసియాలో పుట్టి, కొలంబస్ ఓడలో ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టేసిన నిమ్మకాయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

ఒక గ్లాస్ నిమ్మరసం వెనుక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. కేవలం ఒక పండుగా మాత్రమే కాకుండా సామ్రాజ్యాల గమనాన్ని, నావికుల ప్రాణాలను కాపాడిన ఘనత నిమ్మకాయది. భారతదేశం, మయన్మార్, చైనాల్లో పుట్టిన ఈ సిట్రస్ పండు.. ప్రపంచ యాత్రికుడిగా ఎలా మారిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 8వ శతాబ్దంలో అరబ్ వ్యాపారుల ద్వారా నిమ్మకాయలు పర్షియా , ఈజిప్టు దేశాలకు చేరుకున్నాయి. ఆ తర్వాత యుద్ధ సమయంలో ఐరోపాలో అడుగుపెట్టాయి. 1493లో ప్రసిద్ధ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ తన ప్రయాణంలో నిమ్మకాయలను అమెరికా ఖండానికి పరిచయం చేశాడు. అలా ఆసియాలో పుట్టిన నిమ్మ ప్రపంచమంతటా విస్తరించింది.
నావికుల ప్రాణదాత
చరిత్రలో నిమ్మరసానికి అత్యంత ప్రాముఖ్యత రావడానికి స్కర్వీ వ్యాధి ప్రధాన కారణం. పూర్వకాలంలో సముద్ర ప్రయాణాలు చేసే నావికులు విటమిన్-సి లోపం వల్ల వచ్చే ఈ ప్రాణాంతక వ్యాధితో మరణించేవారు. 1700లలో బ్రిటిష్ వైద్యులు నిమ్మరసం తాగడం వల్ల స్కర్వీని నయం చేయవచ్చని కనుగొన్నారు. దీంతో ప్రతి ఓడలోనూ నిమ్మరసం నిల్వ ఉంచడం తప్పనిసరి చేశారు. అందుకే బ్రిటిష్ నావికులను ఇప్పటికీ సరదాగా లిమీస్ అని పిలుస్తుంటారు.
దక్షిణ భారతదేశంలో నిమ్మకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లో దీనిని నారంగం అని పిలుస్తారు. జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టే ఆహారంలో ఏదో ఒక విధంగా దీనిని తీసుకుంటారు. నిమ్మరసం, అల్లం మిశ్రమం గ్యాస్ సమస్యలకు, అజీర్ణానికి అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. శరీరం నుంచి విషతుల్యాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి ఆవరణలో పెద్దగా శ్రమ లేకుండా పెరిగే నిమ్మచెట్టు ప్రతి ఇంట్లోనూ ఒక మెంబర్‌లా మారిపోయింది. మనం తాగే నిమ్మరసం కేవలం రుచికరమైన డ్రింక్ మాత్రమే కాదు, అది మానవ మనుగడలో భాగమైన ఒక గొప్ప ఔషధం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చిన్ని నిమ్మకాయ, మన ఆహారంలో నిత్యం ఉండాల్సిందే.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




