సినిమాని మించిన ట్విస్టులు.. 50ఏళ్ల క్రితం విడిపోయిన లవర్స్‌ను కలిపిన షార్ట్ ఫిలిం.. అసలు కథ ఏంటంటే..?
ఒక షార్ట్ ఫిలిం.. 50 ఏళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు ప్రేమికులను మళ్లీ కలిపింది. 50ఏళ్ల క్రితం టీనేజ్ వయసులో చిగురించిన ఆ మూగ ప్రేమ, ఎన్నో మలుపులు తిరిగి, వృద్ధాప్యంలో పెళ్లి పీటలెక్కింది. కేరళకు చెందిన 65 ఏళ్ల జయప్రకాష్, రష్మిల కథ సినిమాను మించిన ట్విస్టులతో సాగింది.

ప్రేమకు వయసుతో సంబంధం లేదని, మనసుంటే మార్గం ఉంటుందని ఈ కేరళ జంట నిరూపించింది. 50 ఏళ్ల క్రితం టీనేజ్ వయసులో మొదలైన ఒక మూగ ప్రేమ, ఇరు కుటుంబాల పిల్లలు, అల్లుళ్ల సమక్షంలో పెళ్లి పీటలెక్కింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందక్కల్‌కు చెందిన జయప్రకాష్‌కు టీనేజ్ వయసులోనే రష్మి అంటే ఎంతో ఇష్టం. కానీ తన ప్రేమను ఆమెకు చెప్పడానికి భయపడి మనసులోనే దాచుకున్నాడు. ఈ క్రమంలో కాలం వేగంగా మారిపోయింది. రష్మికి మరో వ్యక్తితో వివాహం కాగా జయప్రకాష్ ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత జయప్రకాష్ కూడా పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. వీరిద్దరూ ఎవరి జీవితాల్లో వారు సంతోషంగానే ఉన్నారు.
విధి ఆడిన వింత నాటకం..
పదేళ్ల క్రితం రష్మి భర్త మరణించగా, ఐదేళ్ల క్రితం జయప్రకాష్ భార్య కన్నుమూశారు. ఒంటరితనంతో బాధపడుతున్న రష్మి, ఆ వేదన నుండి బయటపడటానికి సాంస్కృతిక కార్యక్రమాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించడం ప్రారంభించారు. మరోవైపు తండ్రి ఒంటరితనాన్ని గమనించిన జయప్రకాష్ పిల్లలు, ఆయన్ని రెండో వివాహం చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఒకరోజు రష్మి నటించిన ఒక షార్ట్ ఫిలిమ్‌ను జయప్రకాష్ చూశారు. ఐదు దశాబ్దాల క్రితం తాను ప్రేమించిన వ్యక్తిని గుర్తుపట్టిన ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్శకుడి ద్వారా ఆమె కూతురు ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. పాత జ్ఞాపకాలు మళ్లీ చిగురించాయి. జయప్రకాష్ తన వివాహ ప్రపోజల్‌ను రష్మి ముందు ఉంచారు.
పిల్లల ఆశీస్సులతో ఒక్కటయ్యారు..
“మా అమ్మ సంతోషమే మాకు ముఖ్యం” అంటూ రష్మి కూతురు, అల్లుడు ఈ వివాహానికి పచ్చజెండా ఊపారు. గత ఆదివారం కొచ్చిలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది? అంటూ రష్మి కూతురు తన తల్లి పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. తల్లిదండ్రుల ఒంటరితనాన్ని అర్థం చేసుకుని, వారి ప్రేమను గౌరవించిన ఈ పిల్లలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




