3 ఏళ్ల క్రితం నేలకొరిగిన తాటి చెట్టు లేచి నిల్చుంది.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమేనేమో?
గ్రామాల్లో ఏదైనా వింత ఘటన జరిగితే స్థానికులు నిద్రపోరు. అందులోనూ ఎన్నడూ కనీవినని సంఘటనైతే ఆసక్తితోపాటు భయం కూడా తోడవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఓ గ్రామంలో జరిగింది. మూడేళ్ల క్రితం ఓ రైతు పీకి పక్కన పడేసిన భారీ తాటి చెట్టు.. ఎవరో ఆదేసించినట్లు తాజాగా దానంతట అదే లేచి నిటారుగా నిలబడింది..

మహాబూబాబాద్, జనవరి 8: బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అనే చర్చ మరోమారు చర్చకు వచ్చింది. మహాబూబాబాద్‌లో జరిగిన ఓ వింత సంఘటన ఇందుకు కారణం. మూడేళ్ల క్రితం నేల కూలిన ఓ తాటి చెట్టు దానంతట అదే లేచి నిల్చుంది. అదేంటీ ..? అని అనుకుంటున్నారా. ఇది అక్షరాలా నిజమండీ. మూడేళ్ల క్రితం నేలకొరిన చెట్టు తిరిగి అదే స్థానంలోనే దానంతట అదే లేచి నిటారుగా నిలబడింది. అంతే ఈ ఆశ్చర్యకర ఘటన స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మహాబూబాబాద్ జిల్లా వేంనూరు గ్రామంలో బుధవారం (జనవరి 7) ఈ వింత చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
మహాబూబాబాద్ జిల్లా వేంనూర్ గ్రామంలో గౌడ కులానికి చెందిన నలమాస గుట్టయ్య, నరసయ్యలకు చెందిన వరి పొలాన్ని మూడేళ్ల క్రితం ఓ ముస్లిం వ్యక్తి కొనుగోలు చేశాడు. అతడు భూమిని చదును చేస్తుండగా తాటి చెట్టు అడ్డుగా ఉందని భావించి.. ఆ తాటి చెట్టును వేర్లతో సహా తొలగించి పక్కన పడేశాడు. అయితే మూడేళ్ల తర్వాత ఆ చెట్టు వేర్లు ఎండిపోయి దాదాపు శిధిలావస్థకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం (జనవరి 7) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆ తాటి చెట్టు దానంతట అదే లేచి నిల్చుంది. అలా అది లేస్తున్న క్రమంలో పటాపటా భారీ శబ్దాలు చేస్తూ ఆ పక్కనే ఉన్న గుబ్బ చెట్టుపై వాల్చుకుని నిలబడింది. ఈ వింత ఘటనను అదే సమయంలో పొలాల్లో ఉన్న గొర్ల కాపర్లు, రైతులు కళ్లప్పగించి చూశారు.
ఈ హఠాత్పరిణామానికి భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ వింతను చూసేందుకు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు గుంపులు గుంపులుగా రాసాగారు. ఈ క్రమంలో గ్రామానికి ఏదైనా కీడు సోకనుందా అంటూ అక్కడి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది మంచికి జరిగిందా? చెడుకు సంకేతమా? అంటూ చర్చించుకుంటున్నారు. దీని వెనుక భూతం ఉందా? దైవం ఉందా అంటూ భయాందోళలకు గురవుతున్నారు. మరోవైపు బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమౌతుందా అంటూ వారి మధ్య చర్చ నడుస్తుంది. ఎన్నడూ ఎక్కడా కనీవినని రీతిలో పీకిపక్కన పడేసిన చెట్టు.. దానంతట అదే లేచి నిలబడటం ఏంటని జనాలు భయంతో గజగజలాడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




