Baba Vanga: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచ శక్తిగా మారుతాడా.. బాబా వంగా ఏం చెప్పారంటే..?
దశాబ్దాల క్రితమే ఒక అంధురాలైన దార్శనికురాలు 2026 గురించి చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. 9/11 దాడుల నుండి కోవిడ్ మహమ్మారి వరకు ఆమె చెప్పినవి నిజమయ్యాయని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. మరి 2026లో రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి బాబా వంగా చెప్పినవి నిజం కాబోతున్నాయా..? అసలు ఆమె ఏం చెప్పారు..?

ప్రపంచం ఎటు వెళ్తోంది.. రాబోయే రోజుల్లో మానవాళికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి.. ఈ ప్రశ్నలు వచ్చినప్పుడల్లా అందరికీ గుర్తుకు వచ్చే పేరు బాబా వంగా. అంధురాలైన ఈ బల్గేరియన్ దార్శనికురాలు దశాబ్దాల క్రితం చెప్పిన విషయాలు ఇప్పుడు అక్షరాల నిజమవుతుండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 2026కు సంబంధించి ఆమె చేసిన అంచనాలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. బాబా వంగా తన ప్రవచనాల్లో ఉత్తర ప్రాంతం నుండి ఒక బలమైన పాలకుడు ఎదుగుతాడని, ప్రపంచవ్యాప్తంగా ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నా.. అప్రతిహతంగా దూసుకుపోతాడని తెలిపారు. నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితులను చూస్తుంటే అది వ్లాదిమిర్ పుతిన్ గురించేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, దౌత్యపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రష్యా ఇంకా శక్తివంతమైన దేశంగానే కొనసాగుతోంది. పశ్చిమ దేశాలు దూరం పెట్టిన వేళ, ఇరాన్ వంటి దేశాలు రష్యాతో జట్టు కట్టడం బాబా వంగా చెప్పిన ఊహించని మిత్రుల అంచనాకు బలం చేకూరుస్తోంది. పుతిన్ గ్రహ జాతకం ప్రకారం ఆయన గందరగోళ పరిస్థితుల్లోనే మరింత బలంగా తయారవుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
2026లో గ్రహాంతరవాసుల రాక
బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026 నవంబర్‌లో ఒక భారీ అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంటే మానవాళికి గ్రహాంతర జీవులతో మొదటి పరిచయం ఈ ఏడాదే జరగవచ్చు. హార్వర్డ్ శాస్త్రవేత్త అవి లోబ్ వంటి వారు కూడా అంతరిక్షంలో కృత్రిమ వస్తువుల కదలికల గురించి ప్రస్తావించడం ఈ వాదనకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఏఐ రాజ్యధికారం
మనం ప్రస్తుతం చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం గురించి బాబా వంగా అప్పుడే హెచ్చరించారు. 2026లో ఏఐ పరిజ్ఞానం మానవ నియంత్రణను దాటి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుందని ఆమె అంచనా వేశారు. సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో చూస్తుంటే ఇది కూడా నిజమయ్యేలానే కనిపిస్తోంది.
ప్రకృతి కన్నెర్ర – విపత్కర పరిస్థితులు
రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాలు మనుషులను అతలాకుతలం చేయబోతున్నాయని ఆమె హెచ్చరించారు. వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
ప్రిన్సెస్ డయానా మరణం, 9/11 దాడులు, కోవిడ్-19 వంటి సంఘటనలను ముందే ఊహించిన బాబా వంగా మాటలను కొట్టిపారేయలేమని ఆమె అనుచరులు నమ్ముతున్నారు. అయితే ఇవి కేవలం నమ్మకాలా లేక భవిష్యత్తులో జరగబోయే వాస్తవాలా అనేది కాలమే నిర్ణయించాలి.




