Viral Video: వర్షాకాలంలో బయటకు వెళ్తున్నారా.? అయితే ఈ వీడియో చూస్తే మీ గుండె గుభేలే..
ఓ వ్యక్తి తన భార్యతో సహా స్కూటీపై డాక్టర్ వద్దకు వెళ్తున్నాడు. భారీ వర్షం రావడంతో నీళ్లతో నిండిన లోతైన గుంతను గమనించలేక పోవడంతో..
వర్షాకాలం మొదలైంది. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలతో వాహనాలపై బయటకు వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే జర్నీ చాలా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి తన భార్యతో సహా నీళ్లతో నిండిన లోతైన గుంతలో పడిపోయాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. చుట్టు పక్కల ఉన్నవారు వెంటనే స్పదించడంతో భారీ ప్రమాదం తప్పింది. నెటిజన్లు ఈ వీడియోపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, మున్సిపల్ అధికారులను తిట్టిపోస్తు్న్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న దయానంద్ సింగ్ అత్రి అనే ఓ పోలీసు, అతని భార్య అంజు.. వైద్య పరీక్షల కోసం డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. మార్గమధ్యలో వర్షం కారణంగా ఓ భారీ గుంత నీటితో నిండిపోయింది. చుట్టు పక్కల నీరు ఉండడంతో, అది గొయ్యి అని గుర్తించడం కొంచెం కష్టంగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ స్కూటీతో పాటు లోతైన ఆ గొయ్యిలో పడిపోయారు. భార్యాభర్తలు గోతిలో పడిపోవడం చూసి మార్కెట్‌లోని వ్యాపారులు గుమిగూడి ఇద్దరినీ బయటకు తీశారు. గోతిలో పడి భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్కూటర్ మాత్రం అందులో పూర్తిగా మునిగిపోయింది.
Visuals from UP’s Aligarh.
Leaving this here. pic.twitter.com/bOhACL96IW
— Piyush Rai (@Benarasiyaa) June 18, 2022
మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్యానికి తానే బాధ పడాల్సి వచ్చిందని పోలీసు దయానంద్ సింగ్ అత్రి అన్నారు. తాను స్కూటర్‌పై వెళ్తుంటే ముందున్న రోడ్డు అంతా నీటితో నిండిపోయిందన్నారు. నీటి కారణంగా గొయ్యిని గుర్తించలేక అందులో పడిపోయామని ఆయన తెలిపాడు.
కాగా, వర్షాకాలంలో ఇక్కడ తరచుగా నీరు నిండిపోతుందని, దీనివల్ల ముందు గొయ్యి ఉందో లేదో తెలియదని, ఈ గొయ్యి కారణంగా గతంలో అనేక సంఘటనలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు.