నాన్నంటే ఓ బాధ్యత. ఓ ధైర్యం. నాన్నంటే ఓ స్ఫూర్తి. ఓ ఆర్తి.

ప్రపంచంలోని నాన్నలందరికీ ఇదో ఉత్సవం. ఒకప్పుడు అమెరికాకే పరిమితమైన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. నాన్నల కోసం పండుగ జరిపే సంప్రదాయం మొదలయ్యింది. ఫాదర్స్‌డే జరుపుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.

నాన్నంటే ఓ బాధ్యత. ఓ ధైర్యం. నాన్నంటే ఓ స్ఫూర్తి. ఓ ఆర్తి.
Fathers Day1
Follow us
Balu

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 19, 2022 | 11:39 AM

ఇవాళ ఫాదర్స్‌ డే. ప్రపంచంలోని నాన్నలందరికీ ఇదో ఉత్సవం. ఒకప్పుడు అమెరికాకే పరిమితమైన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. నాన్నల కోసం పండుగ జరిపే సంప్రదాయం మొదలయ్యింది. ఫాదర్స్‌డే జరుపుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. నాన్నకు గుర్తింపు ఇవ్వాలని ఆరాటపడిన ఓ కూతురు పడిన తపన ఉంది. ఆప్యాయత ఆనురాగాలను పంచిన నాన్న కోసం పడిన వేదన ఉంది.. ఫాదర్స్‌ డేను ప్రపంచవ్యాప్తం చేయడానికి పడిన పోరాటం ఉంది.

నాన్నంటే ఓ ఆసరా. ఓ భరోసా. నాన్నంటే ఓ బాధ్యత. ఓ ధైర్యం. నాన్నంటే ఓ స్ఫూర్తి. ఓ ఆర్తి. బరువెక్కుతున్న గుండె భారంగా మారుతున్నా, కంటి నిండా నిద్ర కరువవుతున్నా కుటుంబ బరువు బాధ్యతలను భుజాన వేసుకునే ఓ కథానాయకుడు! ఉద్యోగ నిమిత్తం ఇంటిపట్టున ఉండకున్నా ఇంటిపైనే ధ్యాస! తన కుటుంబం ఆనందంగా ఉండాలన్న చిరు ఆశ!

ఎందుకో అమ్మకు లభించినంత గుర్తింపు నాన్నకు లభించలేదు. పిల్లలను పెంచి పెద్ద చేసి, వారికి మంచి జీవితాన్ని ప్రసాదించే విషయంలో తల్లిదండ్రులది సమాన బాధ్యత! అయినా అమ్మతో పోలిస్తే నాన్నకు గుర్తింపు తక్కువే! అప్పుడెప్పుడో అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన సొనారాకు ఇదే అభిప్రాయం కలిగింది. ఫ్యామిలీ కోసం అంతగా కష్టపడే తండ్రికి గుర్తింపు తీసుకురావాలని తపన పడింది. ఎంతో పోరాడింది. నాన్న కోసం ఓ ఉత్సవాన్ని మొదలు పెట్టింది. అదే ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్న ఫాదర్స్‌ డే.

ఇవి కూడా చదవండి

వాషింగ్టన్‌లోని స్పొకనే అనే ఊర్లో హెన్నీ జాక్సన్‌ స్మార్ట్‌. విలియమ్‌ స్మార్ట్ దంపతులుండేవారు. వారి ఆరుగురు పిల్లల్లో సొనారా చిట్టచివరిది. సొనారా ఆరు నెలలున్నప్పుడే తల్లి కన్నుమూసింది. ఆ టైమ్‌లో హెన్నీ జాక్సన్‌ మరో పెళ్లి చేసుకోవచ్చు. అయితే అతడాపని చేయలేదు. తన ఆనందం కంటే పిల్లల సంతోషమే ముఖ్యమనుకున్నాడు. వ్యవసాయం చేస్తూ బిడ్డలను సాకాడు. తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు. ముఖ్యంగా సొనారను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆమెకు తల్లి ఉంటుందని కూడా తెలియనంత ప్రేమను పంచాడు. తండ్రి అప్యాయతానురాగాల మధ్య పెరిగి పెద్దయిన సొనారకు తండ్రులందరికంటే తన తండ్రే గొప్పవాడనుకుంది. తన నాన్న పుట్టిన రోజున ప్రపంచంలోని నాన్నందరూ వేడుక చేసుకోవాలని అనుకుంది. తన నాన్న జూన్‌లో పుట్టాడని తెలుసుకాని ఏ రోజో తెలియదు. అందుకే జూన్‌ నెలలోని ఓ రోజున నాన్న పుట్టిన రోజును ఘనంగా చేసింది.. ఊరి వారందరిని పిలిచింది. ఇది కేవలం తన తండ్రి జన్మదినమే కాదని, నాన్న బాధ్యతలను పోషించే అందరిదని, అందుకే ఈ రోజును ఫాదర్స్‌డేగా జరుపుకుందామని సొనారా చెప్పింది. ఈ ఆలోచన అందరికి నచ్చింది. అప్పట్నుంచి ఆ గ్రామ ప్రజలు ఫాదర్స్‌డేను జరుపుకోవడం మొదలు పెట్టారు. తర్వాతర్వాత చుట్టు పక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది. మదర్స్‌ డేను జరుపుకుంటున్నప్పుడు ఫాదర్స్‌ డే ఎందుకు జరుపుకోకూడదని సొనారా భావించింది. ఇందుకోసం గట్టిగా పట్టుపట్టింది.. ఆమె పట్టుదల కారణంగా 1910, జూన్‌ 19న తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్‌ డే వేడుకలు జరిగాయి. వాస్తవానికి జూన్‌ అయిదున ఈ వేడుకలను నిర్వహించాలనుకున్నారు. కొన్ని కారణాలవల్ల ఆలస్యం కావడంతో జూన్‌ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌ డేగా జరుపుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. 1916లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేశారు. జూన్‌ మూడో ఆదివారం ఫాదర్స్‌ డే జరుపుకోవాలంటూ 1966లో అప్పటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ ఆదేశాలిచ్చారు. రిచర్డ్‌ నిక్సన్‌ ఫాదర్స్‌ డేకు విశిష్ట ప్రాచుర్యాన్ని కల్పించాడు. అప్పట్నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్‌డేను జరుపుకుంటున్నారు.. ఇదీ ఫాదర్స్‌ డే కథ.

Fathers Day2

ఇవి వెనుకటి రోజులు కావు. నాన్న వస్తున్నాడంటే భయంతో బిగదీసుకుపోయే రోజులు కావివి! ఇప్పుడు నాన్న వస్తున్నాడంటే సంబరం! వర్తమానంలో ప్రేమను పంచుతున్నది, మమతలను పెంచుతున్నది నాన్నే! నాన్నంటే దైవం. నాన్న ఆప్యాయత అనంతం. నాన్నంటే ఒకప్పుడు బెరుకు, భయం.. ఇప్పుడు నాన్నే సర్వస్వం.. అమ్మతో సమానం.. కొన్ని సందర్భాలలో కాసింత ఎక్కువే! దేహమూ విజ్ఞానమూ ఇచ్చేది నాన్నే కదా! విద్యాబుద్ధులు నేర్పించేది నాన్నే కదా! బిడ్డల అభ్యున్నతి కోసం అహర్నిశమూ కష్టపడేది నాన్నే కదా! తను పస్తులుండి పిల్లల ఆకలి తీర్చేది నాన్నే కదా! త్యాగనిరతకు నిదర్శనం నాన్నే కదా! కష్టాలను దిగమింగుకుని కొడుకు కూతుళ్లకు సంతోషాన్ని పంచేది ఆయనే కదా! పిల్లలు నలత చెందితే నాన్నే కదా డాక్టరయ్యేది! పిల్లలకు కష్టాలు కమ్ముకొస్తే అందులోంచి బయటపడేసేందుకు నాన్నే కదా లాయరయ్యేది! నాన్న ఎవరికైనా నాన్నే! పిల్లల దృష్టిలో ఆయనో బాహుబలి. ఓ సూపర్‌మన్‌! ఓ సూపర్‌స్టార్‌. ఆపదలను తప్పించే కథానాయకుడు! సముద్రమంత కష్టాలను భరిస్తూ ఆకాశమంతా ఆనందాన్ని పంచిపెడతాడాయన!

బిడ్డల ఎదుగుదలకు తను సోపానమవుతాడు. నిజంగానే నాన్న మనసు వెన్న. పిల్లల మీద ప్రేమతో అది కరుగుతూనే ఉంటుంది. బిడ్డ సాధించే ఘనతలకు మొదట పొంగిపోయేది నాన్నే! గర్వపడేది కూడా నాన్నే. పది మందికి చెప్పుకుని మురిసిపోయేదీ ఆయనే! నాన్న వసంతరుతువులాంటి వాడు! నాన్న గోరువెచ్చని సూరీడంటివాడు! వెన్నెల కురిపించే చందమామ. ఆయన పక్కనుంటే అదో ధీమా! ఆత్మస్థయిర్యపు ఆలంబన. తన పరిధిమేర కావలిసినవన్నీ అందించే కల్పవృక్షం.. మనసు తెలుసుకుని అడగకుండానే ఇచ్చే కామధేనువు. ఆకాశం కంటే తండ్రే ఉన్నతమైనవాడు. సమస్త దేవతల మహిమ తండ్రిలో ఉంటుంది.. ఆయన గుండెచప్పుడు బిడ్డల కోసమే. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియని విద్య అంటూ ఉండదు. చిన్న దెబ్బ తగిలితే ‘అమ్మ’ అంటూ తల్లిని స్మరించుకుంటాం కానీ తల్లడిల్లిపోయేది నాన్నే! గాయపడేదీ నాన్నే! “నాన్న” అన్న రెండు అక్షరాలలో లక్షల టన్నుల ప్రేమ ఉంటుంది. “నాన్న” అన్న రెండు అక్షరాలు తోడుంటే ప్రపంచాన్ని జయించగలననే నమ్మకం వస్తుంది. అవును- నాన్న అంటే మన శ్వాసలో శ్వాస. గుండెల్లో అవిశ్రాంతంగా కొనసాగే లయ. రేపటి మన అడుగుకి కొండంత బలం. పైకి కనిపించవు కానీ ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా నాన్నపై ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయి. కానీ, కన్నతండ్రిపై మిన్నగా ఉన్న ఆ ప్రేమని వ్యక్తంచేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపరు! చిన్ననాటి నుంచి మాతృప్రేమతోపాటే మన అణువణువులోకీ పితృప్రేమ కూడా ఇంకిపోతుంది. అయితే, మాతృప్రేమని కీర్తించినంత ఘనంగా పితృప్రేమని ప్రకటించే సందర్భాలు కానీ, సామాజిక పరిస్థితులు కానీ పెద్దగా లేవు. అయినా నాన్న ఏ ప్రతిఫలం ఆశించకుండా, నిరాపేక్షతోనే తన జీవితాన్ని పిల్లల కోసం ధారపోస్తాడు. అమ్మ “వాస్తవం” అయితే నాన్న “నమ్మకం” అని అందుకే చెప్తారు పెద్దలు! ఒక్కసారి కళ్లు ముసుకుని… ఏకాగ్రతలోకి జారుకుని నాన్నని గుర్తుకు తెచ్చుకోండి. మీలో ఎన్ని అపురూప భావనలు సుడులు తిరుగుతాయో! నాన్న గుండెలపై మీ చిన్నారి పాదముద్రలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. తప్పటడుగుల ప్రాయంలో ఆయన అందించిన చిటికెనవేలి స్పర్శ మీకు గుర్తుకొస్తుంది. బాల్యంలో ఆడుకోవడానికి మీ కోసం ఆటబొమ్మగా మారిపోయిన నాన్న జ్ఞప్తికొస్తాడు. మీ జీవిత ప్రస్థానంలో ఆయన ఎక్కించిన ప్రతి మెట్టు దర్శనమిస్తుంది. ఇలా చెప్తూ పోతే ఇదొక తరగని కావ్యం. ఆజన్మాంతం కొనసాగే గొప్ప పితృబంధం!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..