Video: ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఈ మహిళ చెప్పిన సమస్య విని విస్తుపోయిన ఖాకీలు..!
కర్ణాటక ప్రభుత్వం ప్రజా భద్రత, శాంతిభద్రతల కోసం 'మనే మనే పోలీస్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం దీని లక్ష్యం. తుమకూరులో పోలీసులు ఓ ఇంటికి వెళ్లినప్పుడు, ఆ మహిళ తన కొడుక్కి పెళ్లి సంబంధం చూడమని కోరడం వైరల్ అయ్యింది.
ప్రజా భద్రత, శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశ్యంతో కర్ణాటక ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఫ్రెండ్లీ పోలీసింగ్ ‘మణేమనే పోలీస్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పోలీసులు తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని బడవనహళ్లిలో ఓ మహిళ ఇంటికి వెళ్లి ‘ఏదైనా సమస్య ఉందా? వీధి దీపాలు అన్నీ పనిచేస్తున్నాయా?’ అని అడిగారు. అప్పుడు ఆ మహిళ చెప్పింది విని పోలీస్‌లు షాక్ అయ్యారు. ఇంతకీ ఆ మహిళ ఏం చెప్పిందంటే.. ‘నా కొడుకుకి ఒక అమ్మాయిని వెతకండి. అది మా సమస్య. ఇంకేమీ లేదు.’ అని చెప్పింది. ఆ మాటలు విన్న పోలీసులకు ఏమి చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏదైనా చేయగలమా అని చూస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘మణేమనే పోలీస్’ అంటే ఏమిటి?
‘ఇంటింటికి పోలీస్’ అనే కార్యక్రమాన్ని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర జూలై 18, 2025న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా పరమేశ్వర చెప్పిన దాని ప్రకారం, దేశంలో పోలీసులు ఇళ్లను సందర్శించే ఇటువంటి పథకం ఇదే తొలిసారి. మనే మనే పోలీస్ పథకం కింద, పోలీసులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. వారు ప్రజల సమస్యలను విని అవసరమైన చర్యలు తీసుకుంటారు. చట్టపరమైన సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పోలీసు శాఖకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
