భార్య పక్కన పడుకుందామంటేనే భయమేస్తోంది.. విడాకులు ఇచ్చేయండి.. నవ్వొద్దు సీరియస్ మ్యాటర్
ఓ 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టు మెట్లు ఎక్కాడు. తన భార్య నుంచి విడాకులు ఇవ్వండి మహాప్రభో అంటూ వేడుకున్నాడు. తన భార్య క్రూరత్వాన్ని భరించలేకపోతున్నానని గగ్గోలు పెట్టాడు. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా పదండి.!

తన భార్య క్రూరత్వాన్ని ప్రస్తావిస్తూ.. 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టుకు విడాకుల కోసం అప్లై చేశాడు. ఇదొక విచిత్రమైన కేసు కాగా.. అతడి వాదన ఇలా ఉంది. తన భార్య తరచుగా వీధి కుక్కలను తమ ఇంట్లోకి తీసుకువస్తుందని.. వాటిని మంచంపై పడుకోబెట్టుకుని.. తాను కూడా ఆ పక్కనే పడుకోవాలని చెబుతుందని ఆరోపించాడు. అతడి అపీల్‌ను స్వీకరించిన హైకోర్టు.. డిసెంబర్ 1న విచారించనుంది.
పైన పేర్కొన్న జంట.. క్రైస్తవ మతానికి చెందినవారు. 2006 అహ్మదాబాద్‌లో వీరి వివాహం జరిగింది. తన భార్య ప్రతీరోజూ వీధి కుక్కలను తమ ఇంట్లోకి తీసుకురావడం వల్ల తనకు మానసిక క్షోభ, లైంగిక సమస్యలు తలెత్తాయని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు బాధితుడు. అలా తీసుకొచ్చిన కుక్క ఒకటి.. తాను మంచం మీద పడుకున్నా.. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మొరుగుతూ ఉండేదని, ఒకసారి తనను కూడా కరిచిందని బాధితుడు పిటిషన్‌లో పొందుపరిచాడు. అంతేకాదు ఈ కుక్కల గోల కారణంగా చుట్టుప్రక్కల వారు తమను బహిష్కరించారని.. పదేపదే పోలీసులు సమన్లు పంపారని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు సదరు వ్యక్తి. భార్య తనను కుక్కల కోసం వంట చేయించిందన్నాడు. అలాగే అవి తిన్న పాత్రలు తానే కడిగానని చెప్పాడు. తన భార్య పక్కన పడుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా కుక్క తనను కరిచేది. ఇదే విషయాన్ని స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తూ.. వారు దీన్ని నమ్మకపోగా.. ఏప్రిల్ ఫూల్ జోక్ అని కొట్టిపారేశారన్నాడు.
మరోవైపు భర్త ఆరోపణలను తోసిపుచ్చింది భార్య. తాను ఎప్పుడూ వీధి కుక్కలను పెంచుకోలేదని, తన భర్త వీధి జంతువులను చూసుకునే ట్రస్ట్‌లో పనిచేస్తున్నందున పెంపుడు జంతువులను ఇంటికి తీసుకువచ్చాడని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక వీరిరువురిని కోర్టు బయటే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ కోరగా.. అందుకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక భర్త తనకు రూ. 15 లక్షల భరణం కావాలని కోర్టును అడగ్గా.. భార్య తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని కోరింది. కాగా, దీనిపై డిసెంబర్ 1న తుది తీర్పు ఇవ్వనుంది కోర్టు.
