AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: షాపు దోచుకునేందుకు వచ్చిన దొంగను.. తన మాటలతో కన్నీళ్లు పెట్టించిన స్టోర్ మేనేజర్..

అతనికి డబ్బు చాలా అవసరం. దీంతో ఓ మొబైల్ స్టోర్‌లో రాబరీ చేసేందుకు వచ్చాడు. స్టోర్‌లో లేడీ మేనేజర్ మాత్రమే ఉంది. గన్ చూపించి కౌంటర్‌లో ఉన్న డబ్బు అంతా ఇవ్వాలని సూచించాడు. ఈ క్రమంలో ఆమె ఆ దొంగతో సంభాషణ మొదలుపెట్టింది. చివరకు అతని మనసు మార్చింది. తాజాగా ఆ వీడియో వైరల్ అవుతోంది...

Viral Video: షాపు దోచుకునేందుకు వచ్చిన దొంగను.. తన మాటలతో కన్నీళ్లు పెట్టించిన స్టోర్ మేనేజర్..
Thief
Ram Naramaneni
|

Updated on: Feb 23, 2025 | 12:07 PM

Share

కొంతమంది తప్పుడు మార్గాల్లో నడవాలని నిజంగా కోరుకోరు. పరిస్థితులు వారిని ఆ దిశగా పురిగొల్పుతాయి. చేసేది తప్పు అని తెలుసు.. వారిని మనసులో ఆ భావం వెంటాడుతుంది… కానీ తప్పక ఆ దారుల్లో పయనిస్తూ ఉంటారు. నిజంగా గుండె లోతుల్లోకి చేరేలా మాట్లాడితే వారు ఆ పనులు చేయడం ఆపుతారు. దాదాపు 15 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన ఘటన గురించి మీకు చెప్పాలి. ఫ్లోరిడాలో 20 ఏళ్ల వయస్సు గల మొబైల్ స్టోర్ మహిళా మేనేజర్.. తాను నమ్మకున్న దైవం గురించి భావాలను వ్యక్తపరుస్తూ.. ఓ సాయుధ దొంగ మనసు మార్చింది. ఆ వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి, గన్‌తో భయపెట్టి కౌంటర్‌లోని డబ్బు అడిగాడు. ఆమె నెమ్మదిగా కౌంటర్ వైపు నడిచి ఆ వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించింది.

ఆ స్టోర్ మేనేజర్ పేరు నయారా గొంకాల్వ్స్. ఆమెతో దాదాపు 5 నిమిషాల సంభాషణ అనంతరం ఆ దొంగ తాను తప్పు చేస్తున్నాడని పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తప్పక ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్లు గద్గద స్వరంతో చెప్పాడు. ఆ దొంగ చివరికి క్షమాపణ చెప్పి, తన తుపాకీ నకిలీదని వివరించి, బ్రోవార్డ్ కౌంటీలోని ఆమె షాపు నుండి వెళ్లిపోయాడు. జూలై 23, 2010లో ఈ ఘటన జరిగింది. గన్‌తో దోచుకోడానికి వచ్చిన దొంగతో గొన్‌కాల్వ్స్.. చాలా కూల్‌గా వ్యవహరించింది.  “నేను మీతో యేసు గురించి మాట్లాడబోతున్నాను” ఆమె దొంగతో చెప్పింది. అప్పుడు అతను తాను కూడా క్రైస్తవుడినని, కానీ ఈ పని చేయడానికి సిగ్గుపడుతున్నానని చెప్పాడు.  కానీ తాను ఉంటున్న ఇంటి నుంచి బయటకు పంపకుండా ఉండాలంటే 300 డాలర్లు అవసరమని చెప్పాడు. ఆ దొంగ నయారాకు పదే పదే క్షమాపణలు చెప్పడం వీడియోలో చూడవచ్చు.

అప్పుడు ఆ షాపు మేనేజర్ నయారా మాట్లాడుతూ “మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలీదు. కానీ మనందరం జీవితంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొటాం. ఈ పరిస్థితుల నుంచి ఎవరికి వారు బయటపడాలి” అని చెప్పింది. అయినప్పటికీ అతను నన్ను క్షమించండి.. నాకు డబ్బు అవసరం అన్నట్లు మాట్లాడాడు. అయితే నయారా కౌంటర్‌లో ఉన్న డబ్బు ఇస్తూ..  అవి పోయినందుకు తనను బాధ్యురాలిని చేస్తారని చెప్పింది. దీంతో అతను ఆ డబ్బు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో రికార్డయింది. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి