అక్కినేని నాగచైతన్య
అక్కినేని నాగార్జున నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు నాగచైతన్య. 2009లో జోష్ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా హిట్ కాలేదు. కానీ నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే జోష్ సినిమాలోని తన పాత్రకు ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డ్ అందుకున్నాడు. నాగార్జున, లక్ష్మి దంపతులకు 1986 నవంబర్ 23న జన్మించాడు చైతూ. అయితే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తల్లితోపాటు చెన్నైలో నివసించారు. పీఎస్బీబీ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. పాఠశాలలో ఉన్నప్పుడే గిటార్ నేర్చుకున్నాడు. అలాగే ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. చైతన్య కెరీర్కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ఏమాయ చేసావే. ఇందులో సమంత కథానాయికగా నటించింది. 2010లో ఈ మూవీ విడుదలై మంచి విజయం అందుకుంది.
ఏమాయ చేసావే సినిమా సమయంలో సమంత, చైతన్య మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2017 అక్టోబర్ 6న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. కానీ 2021 అక్టోబర్ 2న తామిద్దరం వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.