Telangana: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వైఎస్‌.షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల. కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో ఆమె నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్‌కు..

Telangana: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వైఎస్‌.షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
Ys Sharmila
Follow us

|

Updated on: Nov 30, 2022 | 12:18 AM

ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల. కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో ఆమె నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఏం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక మహిళ అయి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, తన పాదయాత్ర సందర్భంగా.. సీఏం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గురించి మాట్లాడుతున్నానని, అటకెక్కిన హామీలతో పాటు.. ప్రజల పడే ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని, నిలదీస్తున్నామని.. రుణమాఫీ, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, కేజీ టు పిజి ఉచిత విద్య, సిబిఎస్‌సి సిలబస్‌లో విద్యాబోధన, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువులు, మహిళలకు 12 శాతం రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు. ఇలా ఇచ్చిన ఏ హామీని సీఏం కేసీఆర్ అమలుచేయలేదని ఆరోపించారు. ప్రతి రోజు ఈ అంశాలు గురించి మాట్లాడామని, ప్రజల పక్షాన మాట్లాడటమే తప్పా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా, తెలంగాణ ఏమైనా ఆప్ఘనిస్తానా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని అనుమతులు తీసుకుని, శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తనకు అడుగడుగునా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తన పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలు కాల్చడం, తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తన పాదయాత్ర సందర్భంగా నర్సంపేటలో బస్సును కాల్చి, బస్సుతో పాటు అనేక వాహనాల అద్దాలు పగలగొట్టారని, కార్యకర్తలపై రాళ్లతో దాడిచేశారని, స్వయంగా టీఆర్ ఎస్ ఎంపీపీ అక్కడే ఉండి ఈ బీభత్సం సృష్టిస్తే వాళ్లపై ఎటువంటి కేసులు లేవని, ప్రజల కోసం పోరాడుతున్న తనను దోషిని చేసి అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌కు తీసుకొచ్చారన్నారు.

టీఆర్ఎస్‌ పార్టీ నుంచి ఉద్యమకారులు వెళ్లిపోయారని, ఇప్పుడు ఉన్నడి గుండాలు, స్వార్థ పరులు మాత్రమేనని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎలాంటి గుండాలు ఉన్నారో సీఏం కేసీఆర్‌కు చూపించేందుకే టీఆర్‌ఎస్ నాయకుల దాడిలో ధ్వంసమైన వాహనాలను తీసుకుని వెళ్తుంటే.. ప్రగతి భవన్‌కు ఎంతో దూరంలో తమ వాహనాలను నిలిపివేశారన్నారు. తాము ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలిగించకుండా ఒకే లేన్‌లో వెళ్తుంటే.. పోలీసులు వచ్చి, తమ వాహనాలను ఆపేసి.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా చేశారన్నారు. నర్సంపేటలో కూడా ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించింది టీఆర్‌ఎస్ పార్టీ వారేనని షర్మిల ఆరోపించారు.

పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తమ కార్యకర్తలను తీవ్రంగా కొట్టారని వైఎస్‌.షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బూటు కాళ్లతో తన్నారని, వాళ్లు కొట్టిన దెబ్బలకు తమ పార్టీ నాయకులకు గాయాలయ్యాయన్నారు. తొడమీద వాసిందని, బట్టలు కూడా చించివేశారని ఆరోపించారు. 61 ఏళ్ల వయసున్న తమ పార్టీ కార్యకర్తను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. అరెస్టు చేశాక.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలని, అరెస్ట్ చేశాక కొట్టే హక్కు ఎవరిచ్చారని షర్మిల ప్రశ్నించారు. పోలీసులు ప్రజా సేవకులుగా కాకుండా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు. తాను గురువారం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తానని షర్మిల తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..