AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. త్వరలో వారికి కూడా రూ.5 లక్షలు..

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో ఉంటున్నవారిని గుర్తించేందుకు సర్వే చేపట్టింది. అనంతరం వీరికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనుంది. ఈ నెలలోనే సర్వే ప్రారంభం కానుంది.

Telangana: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. త్వరలో వారికి కూడా రూ.5 లక్షలు..
Houses
Venkatrao Lella
|

Updated on: Mar 16, 2026 | 11:22 AM

Share

తెలంగాణలోని పేదలకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా పూరి గుడిసెల్లో ఉంటున్నవారిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వే చేపడుతోంది. మార్చి నాలుగో వారం నుంచి ఈ సర్వే మొదలుకానుండగా… గుడిసెల్లో ఉంటున్నవారిని, టార్పాలిన్‌లతో ఇళ్లను ఏర్పాటు చేసుకున్న పేదలను గుర్తించనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల వారీగా నివేదిక సిద్దం చేయనున్నారు. అనంతరం వీరందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనవారిలో ఎవరైనా నిర్మించుకోకపోతే గుడిసెల్లో ఉంటున్న పేదలకు కేటాయించనున్నారు.

గుడిసెలు గుర్తింపు

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా.. ఇందులో భాగంగా పేదలను గుర్తించేందుకు సర్వే చేపట్టనున్నారు. గుడిసెల్లో ఉంటున్నవారికి ఇళ్లను కేటాయించడమే కాకుండా వీరి ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే సామాగ్రి అందించేలా మహిళా సంఘాలు తోడ్పాటు అందించనున్నాయి. సిమెంట్, ఉక్కు, ఇటుకలు, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇతర సామాగ్రిని తక్కువ ధరకే అందించనున్నారు. ఇక రాష్ట్రంలో ఇసుక బజార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ బజార్ల ద్వారా నేరుగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి ఇసుకను తరలించనున్నారు. గుడిసెల్లో ఉంటున్నవారందరికీ గుర్తించే ప్రక్రియ పూర్తయ్యాక వీరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనునున్నారు. వీరికి రూ.5 లక్షల సాయంతో పాటు తక్కువ ధరకే సామాగ్రి అందించనున్నారు.

త్వరలోనే రెండో జాబితా

రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలి జాబితాలో 3,24,593 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిల్లో 2,63,058 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవ్వగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకున్నాయి. మిగతా ఇళ్లను జూన్ లోగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుండగా.. నాలుగు విడతలుగా దీనిని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులను క్లియర్ చేస్తున్నారు. ఇక వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ విడతలో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇళ్లను కేటాయించనుంది. దీంతో ఇళ్ల కోసం చాలామంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Follow Us