Telangana: కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో టోకరా.. బీఎండబ్ల్యూ కారు గెలుచుకున్నారని నమ్మించి.. ఉన్నదంతా ఊడ్చేశారు
సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు బహుమతి వచ్చిందని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇవి మీ వద్దకు రావాలంటే మాకు కొన్ని వివరాలు ఇవ్వాలని అడుగుతున్నారు....
సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు బహుమతి వచ్చిందని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇవి మీ వద్దకు రావాలంటే మాకు కొన్ని వివరాలు ఇవ్వాలని అడుగుతున్నారు. వారి మాటలు నమ్మి మన వివారలు చెప్పాక ఉన్నదంతా దోచుకుంటున్నారు. ఇదీ సైబర్ నేరగాళ్ల పంథా. అయితే ఇందులోనూ నేరాలు చేసే విధానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. తియ్యగా మాట్లాడి సర్వం కాజేస్తున్నారు. తాజాగా కొమ్రం భీం (Kumaram Bhim) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. తిర్యాణి మండలం పంగిడి మాదర గ్రామానికి చెందిన ఆత్రం రవీందర్ అనే గిరిజన యువకుడికి ఫోన్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్ పతి షో నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీరు రూ. 25 లక్షలు విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా గెలుచుకున్నారని నమ్మించారు. కారును ఇంటి వద్ద డెలివరీ చేసేందుకు ఖర్చు అవుతుందని చెప్పారు. అలా రవీందర్ నుంచి రూ.8 లక్షల 50 వేలు కాజేశారు. అయితే వారు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు యువకుడు తన పొలం, జత ఎడ్లను అమ్మేయడం గమనార్హం. డబ్బులు పంపించిన తర్వాత ఫోన్ కట్ చేశారని, వారిని సంప్రదించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వివిధ శాఖల పేర్లు చెబుతూ పోలీస్ అధికారుల ఫోటోలు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ల ఫోటోలు పెట్టి నమ్మించి డబ్బులు లాగారని చెప్పాడు. కాగా.. యువకుని ఖాతాలో రూ.25 లక్షలు జమ చేసినట్టు సైబర్ నేరగాళ్లు రిసీప్ట్ పంపించడం విశేషం.
సైబర్ నేరగాళ్లలో అంతర్రాష్ట్ర ముఠాలే అధికంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ర్టాల్లోకు చెందిన వరే అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇక్కడ చోరీ చేసి అక్కడికి వెళ్లిపోతున్నారని చెప్పారు. అయినప్పటికీ సైబర్ నేరాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే వారి రాష్ట్రాలకు వెళ్లీ అరెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. నకిలీ ఫోన్ కాల్స్, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా వారి మాటలకు లొంగిపోయి మోసపోవద్దని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి