అన్నో పులొచ్చింది.. రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దు.. ఆ ప్రాంతంలో భయం భయం..
యాదాద్రి జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఆవుల మంద పై దాడి చేసి ఆరునెలల లేగ దూడను చంపేసింది. ఇరవై రోజుల లేగ దూడను లాక్కెళ్ళింది. పశువుల మందపై పులి దాడి చేయడంతో పలు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు.

సిద్దిపేట జిల్లాలో 20 రోజుల క్రితం పులి సంచారం ట్రాఫ్ కెమెరా లో అటవీ అధికారులు గుర్తించారు. అదే పులి యాదాద్రి జిల్లాలోని రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో సంచరిస్తోంది. తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఆవుల మంద వద్దకు ఆదివారం ఉదయం పాలు పిండేందుకు కృష్ణ అనే రైతు వెళ్లాడు. లేగ దూడ రక్తపు మడుగులో మృతి చెందడంతోపాటు మరో లేగ దూడ కనిపించకుండా పోయింది. రాజపేట మండలం బేగంపేటలో కూడా చిరుత పులి అడుగులను రైతులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లో పరిసర గ్రామాల రైతులు పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారం నేపథ్యంలో వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఎన్‌జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
రెండు ప్రాంతాల్లో పులి గోర్లతో దాడి చేసిన ఆనవాళ్లు కనిపించాయి. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయంలో పులి దాడి వల్ల దూడ మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాజాపేట మండలంలోని బేగంపేటలో ఫారెస్ట్ అధికారులు పులి పాద ముద్రలను పరిశీలించారు. ఇవి చిరుతపులి అడుగు జాడలేనని, బురదలో అడుగు జాడలు కొంచెం పెద్ద సైజు ఉండటంతో పెద్దపులిగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుర్కపల్లి మండలంలోని గంధమల్ల నుంచి వచ్చి ఉండొచ్చని, రాత్రి ఇక్కడే ఉందా లేదా వెళ్లిపోయిందా అన్న కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని.. పశువుల మంద, వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని అరెస్టు అధికారులు హెచ్చరించారు. గుంపులుగా చప్పుడు చేస్తూ వెళ్లాలని గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. వ్యవససాయ బావుల వద్ద ఉన్న పశువులను ఇంటికి తరలించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. చిరుతపులి జాడలపై వివరాలు సేకరిస్తామని, చిరుత వెళ్లిపోయిన సమాచారం అందించేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
