BRSలో కొత్త లొల్లి.. హరీష్‌కు దక్కుతుందా? కేటీఆర్‌కు ఇస్తారా? మూడో నాయకుడు ముందుకొస్తారా?
సాధారణంగా అధికార పార్టీలో పదవుల కోసం పోటీ ఉంటుంది. ఒక్కోసారి కుమ్ములాటలు కూడా జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో కీలకమైన పదవి కోసం పోటీ ఏర్పడటం.. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మూడింట్లో రెండు ఆల్రెడీ ఫిక్సయిపోగా... మిగిలిన ఒక్క పోస్టు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఏర్పడింది? ఇంతకీ ఏంటా పదవి? ఎందుకా సస్పెన్స్?

సాధారణంగా అధికార పార్టీలో పదవుల కోసం పోటీ ఉంటుంది. ఒక్కోసారి కుమ్ములాటలు కూడా జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో కీలకమైన పదవి కోసం పోటీ ఏర్పడటం.. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మూడింట్లో రెండు ఆల్రెడీ ఫిక్సయిపోగా… మిగిలిన ఒక్క పోస్టు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఏర్పడింది? ఇంతకీ ఏంటా పదవి? ఎందుకా సస్పెన్స్? తెలుసుకుందాం.
తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్.. అసెంబ్లీలో తమ నాయకుడు ఎవరనే విషయాన్ని ఈజీగానే తేల్చేసింది. గులాబీదళానికి సభలో నాయకుడిగా, ప్రతిపక్షనేతగా కేసీఆరే ఉంటారని ప్రకటించింది. అయితే, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత ఎవరన్నదే ఇప్పటికీ తేలలేదు. అసలే, ప్రతిపక్ష పార్టీకి దక్కేది చాలా తక్కువ పదవులు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ రీడర్.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్.. పదవులు ప్రతిపక్షానికి ఉంటాయి. శాసనమండలిలో కూడా ప్రతిపక్ష నేత, పార్టీ ఉపనేత పదవులు ఉంటాయి. అయితే, ఇప్పటికే అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని.. కండువా మార్చిన అరికెపూడి గాంధీకి ఇచ్చేశారు. దీంతో, ఇప్పుడు మిగిలింది బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడి పదవి. అది ఎవరికి ఇస్తారనేదే.. అటు పార్టీవర్గాల్లోనూ, ఇటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీకి కేసీఆర్ ఎలాగూ రెగ్యులర్‌గా రావడం లేదు కాబట్టి.. ఆయనలేనప్పుడు ఆ బాధ్యతలను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తీసుకోవచ్చు. అప్పుడు, బీఆర్‌ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కూడా దొరుకుతుంది. దీంతోపాటు ప్రోటోకాల్ కూడా.. బీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడి తరహాలోనే ఉంటుంది. అంతేకాదు, రెండు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టులను నియమించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే, తమ పార్టీ తరపున ఇద్దరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తామంటూ.. గత బడ్జెట్ సమావేశాల్లోనే కేసీఆర్ చెప్పారు. దీంతో, ఆ పదవులు ఎవరికి దక్కొచ్చనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
పార్టీలో నెంబర్ టుగా ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరికి.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టు దక్కుతుందనే చర్చ జరిగింది. మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టు.. కడియం శ్రీహరికి ఇస్తారనే ముచ్చట అప్పట్లో వినిపించింది. అయితే అనూహ్యంగా ఆయన పార్టీ మారడంతో.. ఉపనేత నియామకం అక్కడే ఆగిపోయింది. ఈలోపే, అసెంబ్లీలో విప్‌గా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ను.. కౌన్సిల్‌లో విప్‌గా సత్యవతి రాథోడ్‌ని నియమించారు కేసీఆర్. కానీ ఇప్పటివరకూ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియామకాలు మాత్రం జరపలేదు.
ఈ రెండు పదవుల్లో ఒకటి కేటీఆర్, మరొకటి హరీష్‌కు ఇవ్వొచ్చన్న చర్చ మొదలైంది. కానీ, అలా చేస్తే కుటుంబ పెత్తనం అనే ఆరోపణలు రావచ్చని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో.. ఏడాదిన్నర గడుస్తుననప్పటికీ అధినేత నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్‌లలో ఎవరికైనా ఒక డిప్యూటీ పోస్టు ఇచ్చి… తలసాని, సబితారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలలో ఒకరికి.. మరో డిప్యూటీ పోస్టు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
కౌన్సిల్లో అపోజిషన్ లీడర్‌గా మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాష్.. ఇద్దరు బీసీనేతలే ఉన్నారు. అక్కడ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్ట్‌ని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ కూడా ఉంది. మొత్తానికి, బీఆర్‌ఎస్‌లో కీలకమైన డిప్యూటీ ప్లోర్ లీడర్ పోస్టుకోసం ఇద్దరు అగ్ర నేతల్లో .. బయట కనిపించని పోటీ ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని అధినేత ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




