AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మేడారం అడవుల్లో వింత.. ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు..!

తెలంగాణలోని ఏటూరునాగారం - మేడారంలోని అడవుల్లో, అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రి 50,000 పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి.

Telangana: మేడారం అడవుల్లో వింత.. ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు..!
Wildlife Sanctuary
Vijay Saatha
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 03, 2024 | 3:22 PM

Share

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం – మేడారంలోని అడవుల్లో, అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రి 50,000 పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. ఒకేసారి నేలమట్టమైన 50 వేలకు పైగా చెట్లు దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో విస్తరించాయి. చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖ తోపాటు అటవీశాఖ అధికారులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 31వ తారీఖున సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మేడారం అడవుల్లో ఒక్కసారిగా అలజడి. పెద్ద ఎత్తున గాలి దుమారం. మహావృక్షాలు సైతం చిగురుటాకులా వణికిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50వేలకు పైగా వృక్షాలు నేల కూలాయి. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణం అంటున్నారు నిపుణులు. ఇదంతా టోర్నడోలు వల్ల జరిగి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా, టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల ధాటికి చెట్లు కూలిపోతాయి. అయితే, ఇలాంటి ప్రతికూల వాతావరణంలో గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉండి, అంతే వేగంగా తిరిగినట్లు అనిపించింది. ఈ టోర్నడోలు టెక్నికల్‌గా అనేక కారకాల వల్ల ఏర్పడుతుందనీ, వీటిలో అధిక వేగంతో కూడిన గాలులు, అవీ సంభవించే మార్గంలో అనేక చెట్లు కూలిపోవడం ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ సంఘటన వల్ల పాత చెట్లపై ఎక్కువ ప్రభావం చూపిందని వారు చెప్పారు.

వాతావరణ శాఖ, అటవీశాఖ ఈ సంఘటనను మరింత వివరంగా పరిశీలించేందుకు, శాటిలైట్ డేటా తోపాటు ఇతర పరికరాలను ఉపయోగించి ఈ ప్రాంతంలో మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..