AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: కమలనాథుల్లో పదవుల రచ్చ..! బీజేపీ అగ్రనేతల ప్లాన్ అదేనా..?

తెలంగాణ బీజేపీలో పెనుమార్పులు చోటుచేసుకునున్నాయా..? బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకు కమలదళం ప్లాన్‌ చేస్తోందా? బండి సంజయ్‌ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించడానికి అధిష్ఠానం సిద్ధమైందా..? రాష్ట్ర బీజేపీ నేతలకు కీలక పదవులు కట్టబెట్టి అసంతృప్తి అనేది లేకుండా చేయడానికి కమలనాథులు భారీగానే స్కెచ్ వేశారా..? ఇంతకీ..టీ బీజేపీలో ఏం జరుగుతోంది..?..

Telangana BJP: కమలనాథుల్లో పదవుల రచ్చ..!  బీజేపీ అగ్రనేతల ప్లాన్ అదేనా..?
Telangana BJP Leaders
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 02, 2023 | 8:40 AM

Share

గత కొన్నిరోజులుగా తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేతల్లో వర్గ విబేధాలు ఓ వైపు సాగుతుంటే.. మరోవైపు అసంతృప్తి, దానికి తోడు సొంత పక్షంవారిపైనే విమర్శలతో బీజేపీ నాయకులు నెట్టుకొస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో తెలంగాణ అధ్యక్షుడిని మారుస్తారనే వార్త బయటకొచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించి, ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి కట్టబెడతారని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుంది.

మరోవైపు రాష్ట్రంలోని కమలనాథులు ఈ మధ్యకాలంలో వరుసగా హస్తినకు క్యూ కడుతున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఇద్దరి తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్లినప్పుడు ఢిల్లీ వేదికగా ఏదో జరుగుతోందని కార్యకర్తలు భావించారు. అయితే.. అగ్రనేతలంతా ఎవరికి ఏ పదవి ఇవ్వాలి..? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి..? అనే విషయాలన్నీ చర్చించాకే ఢిల్లీకి పిలిపించి విపులంగా వివరించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల బీజేపీలో చేరినవారితోపాటు బై ఎలక్షన్‌లో గెలిచిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌లకు పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఇవ్వాలని అగ్రనేతలు ప్లాన్ చేశారట.

ఇది ఇలా ఉంటే..రాష్ట్ర బీజేపీ శాఖపై వివాదాస్పద ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన మాజీ ఎంపీ, బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి మరోసారి న్యూస్ మేకర్‌గా మారారు. పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును జాతీయ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాలని పార్టీ హైకమాండ్‌ను డిమాండ్ చేస్తూ ట్వీట్‌ చేశారు. రఘునందన్‌రావు మాట్లాడుతున్న వీడియోను ట్వీట్‌కు జత చేశారు. ప్రౌడ్ ఆఫ్ యువర్ వాయిస్, ఐ సపోర్ట్ యూ యాస్ నేషనల్ స్పోక్స్‌ పర్సన్ అని BL సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డాలకు ట్వీట్‌ను జత చేశారు. ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

రెండు రోజుల క్రితం, జితేందర్ రెడ్డి బర్రెను తన్నుతూ ఓ ట్రక్కులో ఎక్కిస్తున్న వీడియో ట్వీట్ చేసి బీజేపీ నేతలకు ఈ ట్రీట్‌మెంట్ అవసరమని పేర్కొన్నారు. ఇక్కడితో ఆగలేదు. పార్టీ జాతీయ నేతలైన అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్‌లను ట్యాగ్ చేయడంతో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. తన ట్వీట్‌ను సమర్థిస్తూ, తన ట్వీట్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారి కోసం ఉద్దేశించినదని జితేందర్‌రెడ్డి అన్నారు. మొత్తానికి టీ బీజేపీలో పదవుల పంపకాలతో పార్టీ బలపడుతుందా..? లేదో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..