Telangana Weather: తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన.. పలు ప్రాంతాల్లో పిడుగులు..
తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం కూడా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిసింది. లేటెస్ట్ వెదర్ అప్ డేట్స్ మీ కోసం...

ఇది ఎండాకాలమో… వానాకాలమో అర్థం కావడం లేదు. అదే పనిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. బుధవారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కోమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వనపర్తి, నారాయణపేట, మహబూబాబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని.. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక 11వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, టెంపరేచర్స్ పెరుగుతాయని వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపారు. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని వివరించారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరగనుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం