Telangana: 250 పెట్రోల్ కొట్టిస్తే.. కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయిన బండి.. మెకానిక్ చెక్ చేస్తే షాక్
అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కాదేది కల్తీకి అనర్హం అన్నారు కవులు. దాన్ని రుజువు చేస్తున్నారు కొందరు పెట్రోల్ బంక్ యజమానులు. వాహనదారులను నిండా ముంచుతున్నారు.
Karimnagar district: ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్ ధరలతో గగ్గోలు పెడుతున్నారు సామాన్య ప్రజలు. అది చాలదన్నట్టు కల్తీ రాయుళ్లు తమ ప్రతాపం చూపుతున్నారు. కల్తీ బెడదతో బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. లీటర్ పెట్రోల్ 100 రూపాయల పైనే ఉంది. ఈ ధరలతో ఎలారా దేవుడా అని తలబాదుకుంటుంటే, పెట్రోల్ బంకుల్లో మోసాలు జనాన్ని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్(Huzurabad)లో కల్తీ పెట్రోల్ కలకలం సృష్టించింది. హజురాబాద్ పట్టణంలో వరంగల్ వెళ్లే రోడ్డులోని శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్‌లో 250 రూపాయల పెట్రోల్ పోసుకున్నాడు ఓ వాహనదారుడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్లగానే అతని బండి మొరాయించింది. దీంతో దగ్గర్లోని మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. బండిని చెక్ చేసిన మెకానిక్, పెట్రోల్ ట్యంక్‌లో వాటర్ ఉందని చెప్పాడు. అంతేకాదు, ట్యాంకులో ఉన్న పెట్రోల్ బాటిల్‌లో పోయగా, దాంట్లో సగానికి పైగా నీరు ఉంది. దీంతో అవాక్కైన సదరు వాహనదారుడు, బంక్‌కు వెళ్లి అక్కడి సిబ్బందిని నిలదీశాడు. అక్కడ అతినికి షాకిచ్చే ఆన్సర్ చెప్పారు బంక్ యజమాని. పెట్రోల్ పోసుకొని బంక్ దాటే వరకే మా బాధ్యత ఉంటుందని, ఆ తర్వాత తమకు సంబంధం ఉండదని చెప్పాడు. దీంతో అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. ఆ యజమానితో మాట్లాడాక చెబుతామని చెప్పారు అధికారులు. అంతేకాదు, ఆ బంక్‌లో పెట్రోల్ శాంపిల్ చూశామని, అంతాబాగానే ఉందని చెప్పడం కొసమెరుపు. దీంతో బంక్ వద్ద ఆందోళనకు దిగాడు పెట్రోల్ పోసుకున్న వాహనదారుడు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి, అతనికి సర్దిచెప్పారు. చేసిందే తప్పు పని అని, ఇంకా దాన్ని అధికారులు సమర్ధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు. ఇలా మోసాలకు పాల్పడుతున్న బంకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
Also Read: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త
అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?