Ragging: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం.. ఫస్టియర్ స్టూడెంట్ దుస్తులు విప్పించి
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ర్యాగింగ్ మరోమారు కలకలం రేపింది. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఫస్టియర్ స్టూడెంట్ దుస్తులు విప్పించి ర్యాంగింగ్ చేసినట్టు తెలుస్తోంది.
సద్దుమణిగిందనుకున్న ర్యాగింగ్ మళ్లీ జడలు విప్పుతోంది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్ధులు రెచ్చిపోతున్నారు. వరంగల్‌లో జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో తాజాగా ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఎంబీబీస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ముగ్గురు థర్డ్ ఇయర్ విద్యార్థులు దుస్తులు విప్పించి ర్యాగింగ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి జాతీయ కోటాలో సీటు సాధించి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు తనపై ర్యాగింగ్ చేయడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిపాడు. ర్యాగింగ్ ఘటనపై బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు కేఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంఈ రమేశ్‌రెడ్డి వరంగల్ కేసీఎంసీకి వచ్చి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం. ర్యాగింగ్ చేసిన విద్యార్ధులు క్షమాపణ చెప్పారని, వివాదం అంతటితో సమసిపోయిందని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ తెలిపారు. అయితే బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు మాత్రం క్షమాపణలతో శాంతించలేదని సమాచారం. ప్రస్తుతం వారు వరంగల్‌లోనే ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు.. బాధిత విద్యార్థికి బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల ఇష్యూ బయటకు వచ్చిందని.. సాధారణ విద్యార్థి అయి ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని మిగతా స్టూడెంట్స్ అంటున్నారు. యాజమాన్యం, అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. తమకు సీనియర్ల నుంచి రక్షణ కల్పించాలని జూనియర్ విద్యార్థులు కోరుతున్నారు. కఠిన చర్యలు చేపట్టి తమ జీవితాల నుంచి ర్యాగింగ్ భూతాన్ని వదిలించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Also Read: రాజును చూశా.. రూ10 లక్షలు ఇచ్చేస్తారా..?.. ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిస్తే షాక్ తింటారు