ఆ ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలు.. ప్రస్తుతం సాగుకే కాదు తాగునీటి కటకట తప్పట్లేదు..
ఖమ్మం జిల్లాలో ప్రధాన జలాశయమైన వైరా రిజర్వాయర్ డెడ్ స్టోరేజికి చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 18.4 అడుగులకుగాను ప్రస్తుతం 5.5 అడుగులకు పడిపోయింది. గత పదేళ్లలో ఈ స్థాయికి నీరు చేరడం ఇదే మొదటిసారి. రిజర్వాయర్ కింద 30 వేల ఎకరాలకు సాగునీరు.. సుమారు 200 గ్రామాలకు తాగునీరు.. ఈ రిజర్వాయర్ నుంచే అందుతుంది. ఇపుడు డెడ్ స్టోరేజ్‌కి చేరడంతో తాగునీటికి ఎఫెక్ట్పడే అవకాశం ఉంది.

ఖమ్మం జిల్లాలో ప్రధాన జలాశయమైన వైరా రిజర్వాయర్ డెడ్ స్టోరేజికి చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 18.4 అడుగులకుగాను ప్రస్తుతం 5.5 అడుగులకు పడిపోయింది. గత పదేళ్లలో ఈ స్థాయికి నీరు చేరడం ఇదే మొదటిసారి. రిజర్వాయర్ కింద 30 వేల ఎకరాలకు సాగునీరు.. సుమారు 200 గ్రామాలకు తాగునీరు.. ఈ రిజర్వాయర్ నుంచే అందుతుంది. ఇపుడు డెడ్ స్టోరేజ్‌కి చేరడంతో తాగునీటికి ఎఫెక్ట్పడే అవకాశం ఉంది. రిజర్వాయర్‌పై ఆధారపడిన రైతులు పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటగా.. మరికొందరు వరినార్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ వర్షాలు లేక రిజర్వాయర్ ఎండిపోతుండడంతో రైతులకు నిరాశే మిగిలేలా ఉంది. ఇక రిజర్వాయర్‌పై నమ్ముకుని 2వేల మందికి పైగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. చేపల వేటకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరుత్సాహం నెలకొంది.
ఈనేపథ్యంలో అందరూ వరుణుడి కరుణ కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన జిల్లాలోని వైరా రిజర్వాయర్ రైతుల పాలిట కల్పతరువులా నిలుస్తూ వస్తోంది. సుమారు 19 మైళ్ల మేర జలప్రవాహంతో కొనసాగే ఈ రిజర్వాయర్ సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తోంది. అంతేకాక రిజర్వాయర్‌ను నమ్ముకుని సుమారు 2 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తుండగా.. జిల్లాలోని 11 మండలాల్లో 200 గ్రామాల ప్రజలకు నిత్యం కోటి లీటర్ల మేర తాగు నీరు ఇక్కడ నుంచి సరఫరా అవుతోంది. అయితే, వర్షాభావ పరిస్థితులతో ఈసారి రిజర్వాయర్ అడుగంటే స్థాయికి చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 18.4 అడుగులు కాగా ప్రస్తుతం 5.5 అడుగులకు పడిపోవడంతో సకాలంలో వర్షాలు కురవకపోతే ఖరీఫ్ పంటల సాగు ఎలా అన్న ప్రశ్న అన్నదాతలను వేధిస్తోంది.
ఈ రిజర్వాయర్‌ను ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే నీటిని నిల్వ చేసేలా నిర్మించగా, వర్షపు నీరు వాగులు, వంకలను దాటుతూ వచ్చి చేరుతుంది. నాడు బీడు భూములను సస్యశ్యామలంగా మార్చిన ప్రాజెక్టుగా పేరుండగా.. గత కొన్నేళ్లుగా ఎదురవ్వని గడ్డు పరిస్థితి ఈసారి వచ్చింది. గత సీజన్లో సరైన వర్షాలు పడలేదు. దీనికి తోడు ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలోని అన్ని జలాశయాల మాదిరిగానే వైరా రిజర్వాయర్ ఎండుముఖం పట్టింది. వరుణుడు కరుణిస్తే ఆయకట్టు పరిధిలో 30 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. జూన్ నెలలో వర్షాలు కురుస్తాయని ఆశించినా సరైన వర్షాలు కురవక పోవడంతో రైతుల్లో నిరాశ మిగిలింది, జూలై నెలల్లో వర్షాలు కురిసి రిజర్వాయర్లోకి పూర్తి స్థాయిలోకి నీరు చేరితే ఆశించిన స్థాయిలో పంటలు సాగవుతాయి.
ప్రధానంగా ఇల్లెందు, కారేపల్లి, ఏన్కూరు, కొణిజర్ల, కామేపల్లి ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు చేరితేనే రిజర్వాయర్ నిండుతుంది. లేదంటే సాగర్ జలాలు విడుదల చేసినప్పుడు రిజర్వాయర్లో వదులుతారు. ఈసారి అటు వర్షాలు లేక.. ఇటు సాగర్ జలాలు విడుదల చేసే పరిస్థితి కానరాక వైరా రిజర్వాయర్ ఎడారిని తలపిస్తోంది. అధికారులు మాత్రం 16 అడుగుల మేర నీరు ఉంటేనే సాగు అవసరాలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిజర్వాయర్లో డెడ్ స్టోరేజీ స్థాయి 5.5 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. త్వరలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసి రిజర్వాయర్ నిండితే ఆయకట్టులో సాగుమొదలవుతుంది. లేకపోతే ఆరు తడి పంటలు సాగు చేయాల్సిందే. ఇక్కడ రైతులు ఏటా బీపీటీ రకం ధాన్యాన్ని సాగు చేస్తారు.
అన్నపూర్థగా పేరున్న రిజర్వాయర్ నిండి కనీసం 2.5 టీఎంసీల నీరు లేకపోతే వైరా, తల్లాడ, బోనకల్ మండలాల పరిధిలో సాగు కష్టమేనని చెబుతున్నారు. గోదావరి జలాలు వస్తేనే.. రిజర్వాయర్ నుండి మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని 11 మండలాలకు రోజుకు కోటి లీటర్ల మేర తాగునీటిని విడుదల చేసేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో రిజర్వాయర్లో 1.28 టీఎంసీలు నీరు నిల్వ ఉండేలా మిషన్ భగీరథ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కాగా, రాష్ట్రప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వాయర్లోకి గోదావరి జలాలను విడుదల చేసేందుకు ఇప్పటికే రూ.100కోట్లకు పైగా అంచనా విలువలతో లింక్ కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈపనులు యుద్ధ ప్రతిపాదిక పనులు సాగుతున్నప్పటికీ ఆగస్టు కల్లా గోదావరి జలాలు వస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
